రాష్ట్రంలో రైతు భరోసా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, 'దిశ' చట్టం అమలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. దిశ చట్టం ప్రకారం మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలన్న సీఎం.. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్నితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రైతులకు రక్షణగా..
రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలన్న సీఎం..రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో రైతు భరోసా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిలిచి.. వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతులకు భద్రత కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్ డెస్క్ మాదిరిగానే రైతుల కోసం ఒక డెస్క్ ఉంటుందన్నారు.
కార్యాచరణ తయారు చేయాలి
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఈ డెస్క్‌లు జిల్లా స్థాయి పోలీస్‌స్టేషన్ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచనగా ఉందని సీఎం అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి.. కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్బీకేలు, పోలీసులు అనుసంధానంతో పని చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలామంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారని, అక్కడ వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే చట్టపరంగానూ, వారికి రక్షణగానూ ఈ కొత్త వ్యవస్థ నిలబడాలని సూచించారు. రైతులు మోసాలకు గురి కాకుండా చూడాలి. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే వారికి అండగా నిలవడానికే ఈ కొత్త వ్యవస్థ ఉండాలన్నది ముఖ్య ఉద్దేశమన్నారు.
నేరాలు తగ్గాయి