మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూపొందించిన దిశ చట్టాన్ని సత్వరమే ఆమోదించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. దిశ బిల్లు ఆమోదం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రతిపాదిత ‘దిశ’పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన జగన్..కేంద్ర మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. మహిళలు , చిన్నారులపై లైంగిక వేధింపులు పాల్పడితే ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ తెలిపారు. వేగంగా విచారణ కోసం ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దిశ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ చొప్పున ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను నియమించినట్లు తెలిపారు.
18 దిశ మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని.., ఆపత్కాల సమయంలో మహిళలకు పోలీసు సాయం అందించేందుకు దిశ యాప్‌ను తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు 19.83 లక్షల డౌన్లోడ్లు జరిగాయని లేఖలో తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షల 3 వేల 752 మంది ఎస్ఓఎస్ (SOS) ద్వారా సాయం కోరినట్లు పేర్కొన్నారు. 221 కేసులు నమోదు చేశామని, 1823 కాల్స్‌కు పరిష్కరించినట్లు వివరించారు. ఫోరెన్సిక్ ల్యాబుల ఏర్పాటు, బలోపేతం చేయడం సహా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్లలో 700 మహిళా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. 900 పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 12 దిశ మహిళా కోర్టులు, 9 పోస్కో కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దిశ చట్టం అమలు కోసం పలు కీలక చర్యలు తీసుకుంటోన్న దృష్ట్యా బాధిత మహిళలు, చిన్నారులకు సత్వర న్యాయం చేసేందుకు దిశ చట్టాన్ని ఆమోదించాలని లేఖలో సీఎం జగన్ కోరారు.