ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని, కేంద్ర జలవనరులశాఖ మంత్రులకు సీఎం జగన్‌ వేర్వేరుగా లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులపై సీఐఎస్​ఎఫ్​(CISF) బలగాలను మొహరించేలా ఆదేశించాలని కోరారు. దీంతోపాటుగా కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డు (KRMB) పరిధిని నిర్దేశించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలను అనధికారికంగా తెలంగాణ వినియోగించటంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.

CM LETTER ON WATER DISPUTES
ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

By

Published : Jul 2, 2021, 4:09 AM IST

జల వివాదంపై సీఎం జగన్ లేఖలు

తెలుగురాష్ట్రాల మధ్య తలెత్తిన కృష్ణా నదీ జలాల వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌(CM JAGAN)..ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కూ మరో లేఖ పంపారు. జలవివాదంపై జోక్యం చేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుల వద్ద భద్రత కోసం సీఐఎస్​ఎఫ్​(CISF) బలగాలను మొహరించాలని కోరారు. కృష్ణా జలాలను అనధికారికంగా తెలంగాణ వినియోగిస్తోందని.. లేఖలో ప్రధానికి ఫిర్యాదు చేశారు. విభజన చట్టం ప్రకారం నీటి లభ్యత ఆధారంగా 511 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని గుర్తుచేశారు. వీటికి విరుద్ధంగా తెలంగాణ అదనపు నీటిని వినియోగించుకుంటోందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 808 అడుగుల వద్దే ఉందని.. విద్యుదుత్పత్తికి ఏమాత్రం అవకాశం లేకపోయినా.. కృష్ణా నదీ యాజమాన్యబోర్డు అనుమతి కూడా లేకుండా.. శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఎడమవైపున ఉన్న పవర్‌హౌస్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి సాగిస్తోందని పేర్కొన్నారు. దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద సాగునీటికి సంబంధించి ఎలాంటి అవసరాలూ లేకపోయినా KRMB అనుమతి లేకుండానే నీటిని తెలంగాణ వాడేస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేశారు. దిగువన సాగుకు నీరు అవసరమైనప్పుడే విద్యుదుత్పత్తి చేసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఎగువ నుంచి వచ్చిన 17.36 టీఎంసీల్లో అనధికారికంగా 6.9 టీఎంసీలు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. రోజూ 2 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వాడేస్తోందని ఫిర్యాదు చేశారు.

తాగు, సాగు కష్టమౌతుంది..

శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీసం 854 అడుగుల నీటి మట్టం లేనిదే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటిని తీసుకోలేమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకీ తాగునీటిని సరఫరా చేయలేమని వెల్లడించారు. అనధికార నీటి వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకొస్తున్నామని సీఎం లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (KRMB) సూచించినా తెలంగాణ అధికారులు పట్టించుకోలేదని స్పష్టం చేశారు. మూడుసార్లు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విద్యుదుత్పత్తి చేస్తూనే ఉందని తెలిపారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోనూ కృష్ణా బోర్డు (KRMB) అనుమతి లేకుండానే ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేశారని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాకు కీలకమైన పులిచింతల వద్దా విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ.. 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారని.. దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ నిండుగా ఉన్నందున అదనపు నీటిని సముద్రంలోకి జారవిడవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.

వందశాతం విద్యుత్తు ఉత్పత్తికి ఆదేశాలు..

విద్యుత్తు ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రత్యేకంగా జీవో జారీ చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి సీఎం జగన్‌ తీసుకెళ్లారు. వందశాతం సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిందిగా అందులో సూచించారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను చెడగొట్టేలా ఏకపక్షంగా తెలంగాణ తీసుకుంటున్న నిర్ణయాలు సరికావని సీఎం జగన్‌ లేఖలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ తీరుతో ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని.. కరవు పీడిత రాయలసీమ జిల్లాలకు నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. అందుకే ప్రధాని జోక్యం చేసుకుని.. తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగించటాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూ మరో లేఖను రాసిన జగన్‌..తెలంగాణ నీటి వినియోగానికి సంబంధించిన వివరాలతోపాటు కృష్ణా బోర్డు (KRMB)కి చేసిన ఫిర్యాదు లేఖల్నీ జత చేశారు.

ఇదీ చదవండి:

CM Letter To PM: 'ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details