ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభించే అవకాశం'

యాదాద్రి ఆలయ నిర్మాణం పనులు 90 శాతానికి పైగా పూర్తవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రిలో ఐదున్నర గంటలపాటు పర్యటించిన సీఎం... మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభించే అవకాశముందని ప్రకటించారు. ఆలయానికి వచ్చిన భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా తుది మెరుగులు దిద్దాలని సూచించారు. దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి వుండాలని.. మూల విరాట్టు స్వామి సేవలు దూరం నుంచి కూర్చొని చూసినా కనిపించేలా వుండాలన్నారు.

yadadri reconstruction updates
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం

By

Published : Mar 5, 2021, 2:33 AM IST

అద్భుత శిల్పకళ సంపదతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో ఐదున్నర గంటలపాటు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో పెద్దగుట్టపైన ఆలయనగరికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్​కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ఉత్తరం వైపున పచ్చదనం కోసం చేపట్టిన పనులను పరిశీలించారు. కొండపైనున్న ప్రత్యేక క్యూలైన్ల నిర్మాణాలను గమనించారు. ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్థపతి ఆనందసాయి వేలు, ఈవో గీతారెడ్డి పనులకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రికి తెలియజేశారు. యాదాద్రి ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగిన సీఎం... పునర్నిర్మాణాలను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. గర్భాలయ తుది దశ పనులపై ఆరా తీశారు. ప్రాంగణం బయట బ్రహ్మోత్సవ మండలం, మాడ వీధుల్లోని విద్యుద్దీపాలు, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై... ఆలయ స్తపతి ఆనందాచారి వేలుకు సీఎం కొన్ని సూచనలు చేశారు.

తూర్పు రాజగోపురం నుంచి గర్భాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. అంతర్భాగంలో చేపట్టిన నిర్మాణాలను వీక్షించారు. మాడ వీధులు, ప్రాకార మండపంలో నిర్మించిన అద్దాల మండపం... పడమటి రాజగోపురం వద్ద వేంచేపు మండపం పరిశీలించారు. గర్భాలయ ప్రాంగణంలో ఇప్పటివరకు జరిగిన పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా తుది మెరుగులు దిద్దాలని సూచించారు. దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి వుండాలని.. మూల విరాట్టు స్వామి సేవలు దూరం నుంచి కూర్చొని చూసినా... కనిపించేలా వుండాలన్నారు. అనంతరం కొండ దిగువన చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. రింగ్‌రోడ్‌ నిర్మాణంతో పాటు ఇతర పనులు పరిశీలించారు.

ప్రధాన ఆలయం చెంతన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసేందుకు తీర్చిదిద్దిన స్తంభాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆలయ నగరి పెద్దగుట్టపైన జరుగుతున్న అభివృద్ధి పనులను యాదాద్రి పైనుంచే గమనించి కొన్ని సూచనలు చేశారు. ఆకాశమంత ఎత్తున తీర్చిదిద్దిన కల్యాణ మండపాన్ని సీఎం వీక్షించారు. ప్రాకారాలు.. మండపాలు కలియతిరిగారు. అనంతరం ప్రాధాన ఆలయంలోకి వెళ్లిన ముఖ్యమంత్రి.. అత్యద్భుతంగా తీర్చిదిద్దన అద్దాల మండపాన్ని వీక్షించారు. అద్దాలకు తోడు ఇత్తడి పూతలు ధగధగమెరిసిపోతూ.. మంత్రముగ్ధులను చేసేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా సీఎం మరిన్ని సూచనలు చేశారు. ప్రధానాలయంపైన శాండ్లియర్‌తో పాటు లైటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రధాన ఆలయానికి ఉత్తరాన 13.23 ఎకరాలతో 104 కోట్లతో చేపట్టిన ప్రెసిడెన్షియల్ సూట్లలో.. 15 విల్లాలకు గాను 14 పూర్తవ్వగా ముఖ్యమంత్రి పరిశీలించారు. కొండ చుట్టూ 130 కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బాహ్య వలయ రహదారి.. దక్షిణ దిశలో మినహాయించి మూడు వైపులా పూర్తి చేశారు. ఈ పనులను సీఎం కేసీఆర్​ పరిశీలించి యాడా అధికారులకు సూచనలు చేశారు. పుష్కరిణి, బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. పునర్నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో అలరారుతున్న ప్రధాన ఆలయం... 4.33 ఎకరాల్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. మాడవీధుల్లోని సాలహారాల్లో విగ్రహాల పొందిక పనులు మినహా... ప్రధానాలయ పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రధాన ఆలయం భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉంది.

ఇదీ చూడండి:ఈటీవీ భారత్​కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ABOUT THE AUTHOR

...view details