Telangana Cm Kcr On Assembly Sessions: 2022-23 బడ్జెట్ ఆమోదమే ప్రధాన అజెండాగా ప్రగతిభవన్‌లో సాగిన మంత్రివర్గ సమావేశంలో.. తెలంగామ ముఖ్యమంత్రి కేసీఆర్.. వివిధ అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరించాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం తాను ఇప్పటికే ప్రయత్నాలు చేపట్టానని, దీనికి తెలంగాణయే స్ఫూర్తి అని చాటుతున్నానన్నారు. తెలంగాణ 2022-23 కొత్త బడ్జెట్ మరింత సంక్షేమపథంలో మందుకు సాగుతుందని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది భారీ బడ్జెట్ ద్వారా రాష్ట్రం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుందని చెప్పారు.
తలసరి ఆదాయం, ఆర్థికవృద్ధి రేటు సహా పలు అంశాల్లో గొప్ప ప్రగతిని సాధించడంతో ఇప్పుడు దేశం మొత్తం మనవైపే చూస్తోందని, మన బడ్జెట్ ఎంత అని అన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు తదితర రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయని చెప్పారు.
పాలనకు గీటురాయి...
KCR On Assembly Sessions: బడ్జెట్ అంటే లెక్కలు మాత్రమే కాదని... రాష్ట్ర పురోగతి, ఉన్నతికి ప్రతీక... పాలనకు గీటురాయిగా కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకున్నా సుస్థిర అభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందని వివరించారు. గతేడాది కరోనా ప్రభావం చూపినా ఆదాయం సడలలేదన్న సీఎం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల విషయంలో లోటు రానీయలేదని గుర్తుచేశారు. బడ్జెట్‌పై ఎప్పుడూ భ్రమలు కలిగించలేదని... అంకెల గారడీ చేయకుండా వాస్తవికతను ప్రతిబింబించామని పేర్కొన్నారు. తెలంగాణ పురోగమనానికి ఎంత కష్టపడ్డామో ప్రతీశాఖలోనూ చర్చ సందర్భంగా తెలంగాణ ప్రగతి, దేశం పరిస్థితిని తెలియజెప్పాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.