ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: జీహెచ్​ఎంసీలో లాక్​డౌన్​..? త్వరలో నిర్ణయమన్న కేసీఆర్​ - CM KCR HIGH LEVEL MEETING

తెలంగాణలోని జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ... పెరుగుతున్న వేళ వైరస్​ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొద్ది రోజుల పాటు లాక్​డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా... తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు పెరిగినంత మాత్రాన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్న సీఎం... అందరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

cm-kcr-high-level-meeting-on-corona
cm-kcr-high-level-meeting-on-corona

By

Published : Jun 28, 2020, 6:18 PM IST

Updated : Jun 28, 2020, 8:11 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై... సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం సమీక్షించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌... రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విషయాన్ని వివరించారు.

పరిస్థితిని వివరించిన ఈటల..

దేశంలో మాదిరిగానే తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయని, ఎవరూ భయపడాల్సిన అసరంలేదని.. చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. జాతీయ సగటుతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా తక్కువేనని... ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ... లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు ఈటల పేర్కొన్నారు. కొవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని వెల్లడించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్​డౌన్ విధించాలని వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్... సీఎం కేసీఆర్​కు వివరించారు.

లాక్​డౌన్​పై త్వరలో నిర్ణయం..

"హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న క్రమంలో హైదరాబాద్​లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్​డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్​డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదరాబాద్​లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. లాక్​డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్​ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్​ను సమావేశ పరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్​డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలు, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం" -తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్​

ఇవీ చూడండి:సచివాలయం కూల్చివేత వివాదంపై రేపే హైకోర్టు తీర్పు

Last Updated : Jun 28, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details