cm kcr comments in praja deevena sabha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ''నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని చెప్పాం. తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐకి కృతజ్ఞతలు. మునుగోడు నుంచి దిల్లీ వరకు ఐక్యత కొనసాగాలి.
అమిత్ షా సమాధానం చెప్పాలి..: విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఏవీ మనకు రాలేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే.. 8 ఏళ్లుగా తేల్చటం లేదు. కృష్ణా జలాల్లో మీకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకు అమిత్ షా వస్తున్నారా. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు, సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం. కృష్ణా జలాల్లో వాటా గురించి భాజపా నేతలు మోదీ, అమిత్ షాను ఎప్పుడైనా అడిగారా. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడులో చెప్పాలని అమిత్‌షాను అడుగుతున్నా.
నో మ్యాన్ జోన్ నుంచి జీరో ఫ్లోరైడ్ జిల్లాగా..: మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధ పడిందో తెలుసు. ఫ్లోరైడ్ బాధితుడిని దిల్లీకి తీసుకెళ్లి చూపించినా.. మన మొర ఎవరూ వినలేదు. గతంలోని ఏ పాలకుడు మునుగోడు ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదు. 15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్ కష్టాలపై అవగాహన కల్పించాం. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోరైడ్ జిల్లాగా మారాం. నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. మేధావులు హెచ్చరించినా.. ఫ్లోరైడ్ గురించి గత పాలకులు ఆలోచించలేదు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదు.