తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొల్లు చెప్పారని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. తన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం చెప్పలేదన్నారు. కేంద్రాన్ని నిలదీస్తే దేశ ద్రోహి అంటున్నారని విమర్శించారు. 'తాము మద్దతిచ్చినపుడు దేశ ద్రోహులం కాదా? ఎవరు గట్టిగా మాట్లాడితే వారు దేశ ద్రోహులా? ప్రశ్నించిన వారు ఒక్క రాత్రిలోనే దేశ ద్రోహులవుతారా?' అంటూ మండిపడ్డారు. భాజపా నేతలు 2, 3 స్టాంపులు తయారు చేసి పెట్టుకున్నారని... ఒకటి దేశద్రోహి స్టాంపు.. మరొకటి అర్బన్ నక్సలైట్ స్టాంపు అని ఎద్దేవా చేశారు. తమకు నచ్చకపోతే భాజపా నేతలు ఈ స్టాంపులు వేస్తారని చెప్పారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ (CM KCR) మీడియా సమావేశంలో మాట్లాడారు.
వడ్లను కేంద్రం కొంటుందా.. కొనదా?
సాగు చట్టాలపై మాట్లాడిన భాజపా నేత వరుణ్ గాంధీ కూడా దేశద్రోహేనా అని కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు. తాను చైనాలో డబ్బు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం ఎంత కొంటారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా.. కొనదా..? తేల్చిచెప్పండి అని ప్రశ్నించారు. తనకు సమాధానం కావాలని.... సమాధానం చెప్పేవరకు భాజపాను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
చేపల పులుసు తింటే తప్పా
'రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమే. రాయలసీమకు నీరు ఇవ్వాలని ఈరోజు కూడా చెబుతున్నా. ఏపీ సీఎంను హైదరాబాద్ పిలిపించుకుని మరీ సీమకు నీళ్లు ఇవ్వాలని చెప్పా. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?.'
-కేసీఆర్, సీఎం
ఇకపై రోజూ ప్రెస్మీట్
యాసంగిలో వడ్లు వేయాలని బండి సంజయ్ చెప్పిన మాట తప్పా? కాదా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు 6 హెలికాప్టర్లు పెడతానన్నారు. హెలికాప్టర్లలో వెళ్లి వరి చూసేందుకు బండి సంజయ్, కేంద్ర ప్రతినిధులు రావాలన్నారు. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రుల నుంచి అక్షింతలు పడ్డాయని చెప్పారు. వడ్ల విషయం తప్ప ఏమైనా మాట్లాడుకో అని బండి సంజయ్‌కు హైకమాండ్ పెద్దలు చెప్పారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ కనిపించారని నిలదీశారు. భాజపా నేతల కథ తేల్చేదాకా రోజూ మాట్లాడతానని... తన మీడియా సమావేశం ఇకపై రోజూ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు.. తెరాస సర్కారు సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది బండి సంజయ్ పరిస్థితి ఉందని విమర్శించారు.
ఇదీ చదవండి :KCR : 'కేసీఆర్ను టచ్ చేసి.. రాష్ట్రంలో బతికి బట్ట కట్టగల్గుతారా..?'