ఏలూరు ప్రజల అస్వస్థతకు కారణాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర వైద్య బృందాలు, నిపుణులు, అధికారులతో సీఎం మాట్లాడారు. సీఎస్, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నతాధికారులతోపాటు ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్, సీసీఎంబీకి చెందిన నిపుణులు హాజరయ్యారు. కారణాలను నిర్ధరించడానికి సమగ్ర పరీక్షలు చేస్తున్నామని వైద్య బృందాలు, నిపుణులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఏలూరులో ప్రజల అస్వస్థతకు కచ్చితమైన కారణాలు తెలియలేదన్నారు. సీసం, నికెల్ వంటి మూలకాలు కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. పురుగు మందుల వల్ల జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పూర్తిస్థాయి పరీక్షల ఫలితాలు వస్తేగానీ కారణాలు తెలియవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.
కొత్త కేసులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయని సీఎం జగన్కు అధికారులు చెప్పారు. నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోవాలని అధికారులకు సీఎం సూచించారు. వీలైనంత త్వరగా అన్ని రకాల పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా? లేదా? అనే విషయంపై ముందు దృష్టి పెట్టాలన్నారు. తర్వాత మిగిలిన అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులను కోరారు. వచ్చే శుక్రవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిద్దామన్న సీఎం.. తుది నివేదికల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.