ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 73వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు జెండా వందన వేదిక ప్రాంగణానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి... పోలీసు సిబ్బంది నుంచి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఏపీఎస్పీ బెటాలియన్ సహా వివిధ పోలీసు విభాగాలు, ఇతర రాష్ట్ర పోలీసు కంటింజెట్, ఎన్సీసీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరేడ్‌ను సమీక్షించి... వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు పంద్రాగస్టు సందర్భంగా సీఎం జగన్ అవార్డులు, మెడల్స్ ప్రదానం చేయనున్నారు. 10గంటలకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నవరత్నాల అమలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, ఉపాధి కల్పన, విద్యా వ్యవస్థలో ఫీజుల నియంత్రణ కోసం సంస్కరణలు, ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ కమిషన్, రైతు భరోసా-కౌలు రైతులకూ ప్రయోజనం కల్పించేలా చట్టం చేయడం, కొత్త పరిశ్రమల విధానం... తదితర అంశాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. 11గంటలకు పరేడ్ ముగిశాక సీఎం హైదరాబాద్ వెళ్తారు.