ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

vanijya utsav: కొవిడ్‌ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో పెరుగుదల నమోదు: సీఎం - cm jagan on ease of doing business

విజయవాడ వేదికగా.. వాణిజ్య ఉత్సవ్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని సీఎం తిలకించారు. రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహం కోసం వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో రెండ్రోజులపాటు 'వాణిజ్య ఉత్సవ్' కార్యక్రమం జరగనుంది.

ఎగుమతిదారులకు తగిన అవకాశాలు కల్పిస్తాం: సీఎం జగన్
ఎగుమతిదారులకు తగిన అవకాశాలు కల్పిస్తాం: సీఎం జగన్

By

Published : Sep 21, 2021, 12:17 PM IST

Updated : Sep 22, 2021, 4:24 AM IST

దేశం మొత్తం ఎగుమతుల్లో 5.8%గా ఉన్న రాష్ట్రం వాటాను 2030 నాటికి 10%కు తీసుకెళ్లాలన్నదే లక్ష్యమని సీఎం జగన్‌ తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లలో దేశంలో ఎగుమతులు 11.6% తగ్గితే, రాష్ట్రంలో 19.43% పెరిగాయన్నారు. కేంద్ర పెట్టుబడులు, వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమంలో భాగంగా ‘ది ఎక్స్‌పోర్ట్స్‌ ట్రేడ్‌ కార్నివాల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరిట వాణిజ్య ఉత్సవాన్ని సీఎం జగన్‌ మంగళవారం విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ), ప్లాస్టిక్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి.

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ)లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రెండురోజులు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘దేశంలో 2019-20లో 330 మిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. కొవిడ్‌ కారణంగా 2020-21లో అవి 292 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మన రాష్ట్రం నుంచి 2019-20లో ఎగుమతులు 14.1 మిలియన్‌ డాలర్లు ఉంటే.. 2020-21లో 16.8 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల్లో 2018-19లో దేశంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2020-21కి నాలుగో స్థానానికి చేరింది. కొవిడ్‌ కారణంగా దేశ జీడీపీ వృద్ధిరేటు 7.3% తగ్గితే.. మన రాష్ట్రంలో తగ్గుదల 2.58% మాత్రమే’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎగుమతిదారునికీ తగిన అవకాశాలు కల్పిస్తామని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల వర్గాలను కోరారు.

విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్​..

స్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యం
‘పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎగుమతులను ప్రోత్సహించటంలో భాగంగా రాష్ట్రంలో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు ఓడరేవులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఆక్వా, పడవలు, ఓడల నిర్మాణం, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రూ.5,204 కోట్ల పెట్టుబడులతో 16,311 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటయ్యాయి. వాటిద్వారా 1.13 లక్షల మందికి ఉపాధి లభించింది. రెండేళ్లలో రూ.30,175 కోట్ల పెట్టుబడులతో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయి. వాటిద్వారా 46 వేలమందికి ఉపాధి లభించింది. రూ.34,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు రానున్నాయి. వీటి ద్వారా 76 వేలమందికి ఉపాధి లభించనుంది. ఇవే కాకుండా కొప్పర్తిలో రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 3,155 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 10వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను రూ.730 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. దీనిద్వారా రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి వస్తుంది. కడప ఉక్కు కర్మాగారాన్ని రూ.13,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. గెయిల్‌ భాగస్వామ్యంతో పరిశ్రమలు, గృహ అవసరాలకు గ్యాస్‌ను అందుబాటులో ఉంచటానికి గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని సీఎం తెలిపారు.

ఎగుమతిదారుల కోసం పోర్టల్‌

*రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు సరకు ఎగుమతులకు సింగిల్‌ డెస్క్‌ ద్వారా అనుమతులు పొందటానికి పారిశ్రామికవేత్తలు ‘ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌పోర్టల్‌’ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని పరిశ్రమల శాఖ కల్పించింది. ఈ పోర్టల్‌ను సీఎం జగన్‌ మంగళవారం ఆవిష్కరించారు.
* వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న 400కు పైగా ఉత్పత్తుల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ‘వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌ బిజినెస్‌ అడ్వైజరీ సర్వీసు’ పేరుతో పోర్టల్‌నూ ఆవిష్కరించారు.
* రాష్ట్ర ఎగుమతుల ప్రణాళిక-2021 పుస్తకాన్ని సీఎం వేదికపై ఆవిష్కరించారు.

తిలాపియా చేపలు..సుగంధ ద్రవ్యాలు..
ఆకట్టుకున్న ప్రదర్శనలు

వాణిజ్య ఉత్సవం-2021 సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఇందులో పలు ఉత్పత్తులను ప్రదర్శించారు. ఎంపెడా ఆధ్వర్యంలో తిలాపియా చేపల అక్వేరియంతో పాటు వెనామీ, వివిధ అలంకరణ చేపలు ఆకట్టుకున్నాయి. మచిలీపట్నం ఇమిటేషన్‌ ఆభరణాల సంఘం ఆధ్వర్యంలో పలు ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యమంత్రి జగన్‌ వీటిని ఆసక్తిగా తిలకించారు. లేపాక్షి, జైన్‌ ఇరిగేషన్‌ ఆధ్వర్యంలో తుంపర సేద్య పరికరాలు, ఆహార ఉత్పత్తులతో పాటు కొండపల్లి బొమ్మలు.. సదస్సుకు హాజరైనవారిని ఆకర్షించాయి. సుగంధద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో ప్యాకింగ్‌ చేసిన 52 రకాల ఉత్పత్తులను సీఎం పరిశీలించారు. ఆర్‌కే హెయిర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ తమ ఉత్పత్తులను ప్రదర్శించింది.
* ప్రామిస్‌ పేరుతో రూపొందించిన పలురకాల చర్మకార ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. విజయవాడ సమీపంలోని గన్నవరంలో తయారయ్యే వీటిని ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.
* గుంటూరుకు చెందిన వెంకటపతి ఆరోమాటిక్స్‌ ఆధ్వర్యంలో వివిధ తైల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. విదేశాలకూ ఎగుమతి ఆర్డర్లు వస్తున్నాయని ప్రతినిధి చిరంజీవి చెప్పారు.

ఇదీ చదవండి:

ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం

Last Updated : Sep 22, 2021, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details