'స్పందన' కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. మహమ్మారి కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వార్డు, గ్రామ సచివాలయాల యూనిట్‌గా టీకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. గురువారం తాను కూడా వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు సీఎం తెలిపారు. పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాక కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించాలని నిర్దేశించారు.
'కొవిడ్‌ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఇప్పుడు సాగుతున్న టీకాల కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి. గ్రామసచివాలయం, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని.. వాలంటీర్లు, ఆశాకార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. ఫలానా రోజు వైద్యులు టీకా వేయడానికి వస్తారని వారికి చెప్పడమే గాక...మిగిలిన సిబ్బంది మొత్తం అదేరోజు ఆ గ్రామంలోనే ఉండి సచివాలయం వద్ద అందరికీ వ్యాక్సిన్ వేయించాలి. ఇలా చేస్తే తప్ప మరోమార్గం లేదు.' అని సీఎం జగన్ అన్నారు.
ఉపాధిహామీ పనులపై చర్చించిన సీఎం.. ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరగాలని ఆదేశించారు. పనులను రికార్డు స్థాయిలో చేపట్టారని అభినందించారు. 25.50 కోట్ల పని దినాలను తద్వారా 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలని అధికారులకు సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనకబడ్డాయని ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి మే నెల వరకు పూర్తి చేయాలన్నారు.
బీఎంసీల పనులు పూర్తి చేయాలి
రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. 9,899 చోట్ల బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్ల (బీఎంసీల)ను ఏర్పాటు చేయాల్సి ఉందని, 3,841 చోట్ల పనులు మొదలయ్యాయన్నారు. మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలని ఆగస్టు 31 కల్లా బీఎంసీల పనులు పూర్తి చేయాలని సెప్టెంబర్‌లో వీటిని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టబోతున్నామన్న సీఎం.. దీనికోసం భూములను గుర్తించి.. అక్కడ యూనిట్లను పెట్టించాలన్నారు.
90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి
పేదలకు ఇళ్లు ఇళ్లపట్టాలు అంశంపై అధికారులతో సీఎం చర్చించారు. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులని తేలితే 90 రోజుల్లోగా వారికి ఇంటిపట్టా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 94 శాతం ఇళ్లపట్టాల పంపిణీ పూర్తైందని మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. అలాగే టిడ్కోలో పంపిణీ చేయాల్సి ఉన్న సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పూర్తిచేయాలన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసమైన చోట వెంటనే భూమిని సేకరించాలన్నారు. ఇళ్లపట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో చెప్పగలగాలని, కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించరాదన్నారు.