సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా((YSR Bima) కింద ఇచ్చే పరిహారాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే అందజేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి(cm jagan) బుధవారం నిర్వహించిన సమీక్షలో దీనికి ఆమోదముద్ర వేశారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో ఏర్పడుతున్న చిక్కులకు స్వస్తి పలికి, కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా పథకంలో మార్పుచేర్పులు చేయనున్నారు. వీటిని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న సంపాదిస్తున్న వ్యక్తి సహజంగా మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.లక్ష అందజేయనున్నారు. 18 నుంచి 70 సంవత్సరాల వయసున్న.. సంపాదిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు.
నెల రోజుల్లోనే పరిహారం
వైఎస్‌ఆర్ బీమా పథకానికి అర్హులైన వారి జాబితాను జులై ఒకటిలోపు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈలోపు కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు మరణిస్తే, వారి క్లెయిమ్‌లు కూడా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవేకాకుండా రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మృతి చెందినా, పాడి పశువులు చనిపోయినా ఇచ్చే పరిహారాలను కూడా దరఖాస్తులు అందిన నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించాలన్నారు. అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు, చెల్లింపులపై మూడు నెలలకోసారి కలెక్టర్లు నివేదిక ఇవ్వాలన్నారు. క్లెయిమ్‌ల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పరిహారం అందడంలో జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. బీమా దరఖాస్తుల పరిశీలన బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
లబ్ధిదారులకు రూ.1.35 లక్షల కోట్లు బదిలీ
కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు రూ.95 వేల కోట్లు బదిలీ చేశామని సీఎం తెలిపారు. ఇళ్లపట్టాలు, సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ వంటివి కలిపితే రూ.1.35 లక్షల కోట్లు బదిలీ చేసినా.. ఎక్కడా అవినీతికి తావివ్వలేదని చెప్పారు. ఆర్థికశాఖ అధికారుల శ్రమ వల్లే ఇవన్నీ విజయవంతంగా జరిగాయని, వారిని ప్రత్యేకంగా అభినందించాలని సీఎం పేర్కొన్నారు. కొవిడ్ వల్ల ఆశించిన ఆదాయం రాకపోయినా, ఏ కార్యక్రమం ఆగకుండా అనుకున్న సమయానికి పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకుల్లో జాప్యంతో దక్కని ధీమా
అంతకు ముందు వైఎస్‌ఆర్ బీమా పథకంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు.. సీఎంకు వివరించారు. గతంలో గ్రూప్ ఇన్సూరెన్స్‌గా ఉండే ఈ పథకంలో సగం ప్రీమియం కేంద్రం చెల్లించేదన్నారు. కేంద్రం ఈ పథకం నుంచి వైదొలిగాక, 1.41 కోట్ల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ బీమాను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అయితే బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం, బీమాకు లింకేజి చేయడం, తర్వాత క్లెయిమ్‌లు పరిష్కారం కాకపోవడంతో కుటుంబాలకు పరిహారం అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వివరించారు. బీమా అర్హత కోసం నమోదు చేసుకోవడానికి లక్షల దరఖాస్తులు ఇంకా బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బీమాకు లింకేజి చేశాక కూడా 45 రోజులపాటు లీన్ పీరియడ్‌గా తీసుకొంటున్నారని, ఆ సమయంలో కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదని చెప్పారు.