ఏసీబీ దాడులు చేస్తే తప్ప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల విషయం వెలుగులోకి రాలేదని, అసలు ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతోందని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మన దృష్టికి ఎందుకు రావడం లేదు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో? లేవో? ఎందుకు చూడటం లేదు? ప్రభుత్వ శాఖల్లోని అవినీతికి అడ్డుకట్ట వేయాలి. అవసరమైతే క్షేత్ర స్థాయి నుంచి నిఘా సమాచారం తెప్పించుకోండి’ అని సూచించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, ఆర్థిక, జీఎస్టీ, ఎక్సైజ్‌శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవినీతి లేకుండా చేయాలని, ఈ విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రతి కార్యాలయంలో నంబరు కనిపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌పై అధికారులు దృష్టి సారించాలని, కాల్‌సెంటర్ పూర్తి బాధ్యతలను అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
*కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాదు. అన్ని చోట్లా చలానాల చెల్లింపు విధానం, మీ సేవలో పరిస్థితులను పరిశీలించాలి. కనీసం వారం, పది రోజులకోసారి అధికారులు సమావేశమై ఆదాయ పరిస్థితులపై సమీక్షించాలి. ప్రతి సమావేశంలో ఒక్కో రంగంపై సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి సమావేశంలో సమీక్షించాలి.