ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

49 లక్షలకు పైగా రైతులకు 'భరోసా' - రైతు భరోసా తాజా వార్తలు న్యూస్

రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని 49 లక్షల పైగా రైతులకు తొలివిడత ఆర్థిక సాయాన్ని అందించారు. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద సాగు పెట్టుబడి కోసం నిధులను సీఎం వైఎస్​ జగన్ విడుదల చేశారు. రైతులకు అన్ని రకాల సేవలు అందించేందుకు ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు.

cm jagan review on rythu bharosa
cm jagan review on rythu bharosa

By

Published : May 15, 2020, 9:44 PM IST

సాగు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి నేరుగా ఆర్థిక సాయం చేసే ‘వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వ్యవసాయశాఖకు చెందిన ఉన్నతాధికారులతోపాటు, పలువురు రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైయస్సార్‌ రైతు భరోసా-–పీఎంకిసాన్‌ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం చేస్తున్నారు. గత నెలలో రూ.2 వేలు జమ కాని వారికి ఆ మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఒకేసారి రూ.7500 చొప్పున మొత్తం రూ.3675 కోట్లు ఇచ్చారు. కొంత మందికి గత నెలలో 2 వేల రూపాయలు జమ అయ్యాయి. వీరికి 5 వేల 500 రూపాయల చొప్పున నగదు జమ చేశారు.

రైతు భరోసా పథకం ప్రారంభం తర్వాత.. రైతులు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంతో మాట్లాడారు. తొలుత ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని అనుకున్నామని.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని పెంచి 5 ఏళ్ల పాటు ఏటా రూ.13,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. దీని వల్ల ప్రతి రైతు కుటుంబానికీ 5 ఏళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు. వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం బాధాకరమన్న ముఖ్యమంత్రి, కరోనా వల్ల తప్పడం లేదన్నారు.

గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిటింగ్‌ కోసం గత నెల 24 నుంచి రైతుల పేర్లు ప్రదర్శించామని, ఎవరి పేరైనా లేకపోతే దరఖాస్తు చేసుకోమని కోరామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మూడు వారాల్లో ఎవరైనా దరఖాస్తు చేయకపోతే, తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, మరో నెల రోజుల సమయం ఇస్తున్నామని అర్హులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా, వెంటనే 1902 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే స్పందిస్తామన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో రైతులను ఆదుకోవడం కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతాయని తెలిపారు. ఆర్‌బికేలలో రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, రసాయనాలు విక్రయిస్తారని వాటి నాణ్యతలో ప్రభుత్వానిదే గ్యారంటీ అని చెప్పారు. నాణ్యతతో కూడిన విత్తనాలు, రసాయనాలు, పురుగు మందులు రైతులకు దొరుకుతాయన్నారు. రైతులకు ఇంకా మంచి జరగాలని, వారికి సేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు.

ఇదీ చదవండి:రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details