రహదారుల మరమ్మతుల వేగవంతానికి ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ పరిధిలో జులై 15లోపు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అర్ఆండ్బీ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల పరిధిలో రోడ్ల మరమ్మతుల, నిర్మాణంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వెల్లడించారు.
రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. పురపాలక శాఖ పరిధిలోని 4 వేల పైచిలుకు కి.మీ జూలై 15 లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 27 వేల కి.మీ పైగా పంచాయతీ రోడ్లను శాచురేషన్ పద్దతిలో అభివృద్ది చేయాలని జగన్ దిశానిర్ధేశం చేశారన్నారు. జూలై 20 లోపు మరమ్మతులు, నిర్మాణం పూర్తి చేసి నాడు-నేడు కింద ప్రదర్శించాలని సీఎం ఆదేశించారన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్ కనెక్టెడ్ హాబిట్ విలేజీలకు 5 వేల కి.మీ రోడ్లు పూర్తి చేశామని తెలిపారు.