నదుల అనుసంధానంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీనిపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలన్నీ ఉభయతారకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం అధికారులతో సమీక్షించారు. నదుల అనుసంధానంపై ఇటీవల దిల్లీలో జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ‘మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంలో రాష్ట్ర, దేశ ప్రయోజనాలను కాపాడుకునేలా కేంద్రానికి నివేదికలు పంపాలి. ఇందులో అయోమయానికి, సందిగ్ధానికి తావు ఇవ్వొద్దు’ అని జగన్ సూచించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై దిల్లీలో జరిగిన సమావేశం, దానికి సంబంధించిన వార్తలపైనా చర్చించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు ఆస్కారం లేదు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఎత్తు తగ్గింపుపై ఇంకా చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సీడబ్ల్యూసీ, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖలు విస్పష్టంగా ప్రకటించాయి. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగినట్లుగా షట్టర్ల బిగింపు పూర్తవుతోంది’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
మే నెలాఖరుకల్లా కాఫర్ డ్యాం
కాఫర్ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులను త్వరగా పూర్తి చేస్తే వరద నీటిని స్పిల్‌వే మీదుగా పంపే ఆస్కారం ఉంటుందని సూచించారు. ‘గత ప్రభుత్వ హయాంలో స్పిల్‌వే పూర్తి చేయకుండా.. కాఫర్ డ్యాం నిర్మించడంవల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాఫర్ డ్యాంనూ అక్కడక్కడ కట్టి వదిలిపెట్టారు. వరద నీరు సెకనుకు 13 మీటర్ల వేగంతో వచ్చినప్పుడు ప్రధాన డ్యాంవద్ద నది కోసుకుపోయింది. అందుకే వరదల సమయంలో స్పిల్ ఛానల్ పనులకూ ఇబ్బంది కలిగింది’ అని అధికారులు వివరించారు. గేట్లు, సిలిండర్ల బిగింపు పని చురుగ్గా సాగుతోందని, మే నెలాఖరు నాటికి కాఫర్ డ్యాం పనులూ పూర్తి చేస్తామని తెలిపారు.