గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలకు 14 వేల ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పట్టణాల సమీపంలోని పల్లెలకు 1,034 ఆటోలు కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ కోసం కొత్తగా మరో 11,453 మంది గ్రీన్ అంబాసిడర్లు, 5,551 మంది గ్రీన్ గార్డ్‌ల నియామకానికి ఆయన ఆమోదం తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణకు 9,148 ఇన్సినరేటర్లు, 3,279 మిస్ట్ బ్లోయర్లు, 3,197 బ్రష్ కట్టర్లు, 3,130 హై ప్రెషర్ టాయిలెట్ క్లీనర్లు, 165 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ మిషన్లు, 157 షడ్డింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పనితీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పలు పథకాల అమలుపై అధికారులకు ఆదేశాలు, సూచనలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, వైద్యాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు, డిజిటల్ లైబ్రరీల పనులు ఈ ఏడాదిలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.
మంత్రులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు
‘వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని సమర్థంగా అమలుచేసేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తాం. సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై కమిటీ దృష్టి సారిస్తుంది’ అని సీఎం అన్నారు. ‘వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు ప్రాధాన్యక్రమంలో పూర్తిచేయాలి. రాష్ట్రంలో చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్‌డ్యాం తరహాలో నిర్మాణాలు చేపట్టడంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి’ అని జగన్ ఆదేశించారు.
జలకళ అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి