CM Jagan Review Paddy: ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా చూడాలని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వారికి సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం, సమాచార లోపం ఉండకూడదని సీఎం వివరించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై పౌరసరఫరాలు, వ్యవసాయశాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రైతులకు తోడుగా నిలిచేలా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఇందులో మిల్లర్ల పాత్ర ఉండరాదు. కొనుగోళ్ల తరువాతే వారి భాగస్వామ్యం ఉండాలి. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదు’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఆర్బీకేల్లో ఐదుగురు చొప్పున సిబ్బంది
‘ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు సేవలు అందించాలి. వీరే రైతుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడి పంటల కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీల కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు’ అని సీఎం వివరించారు. ‘అన్ని చోట్లా పంటల కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అనే దానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో అధికారులు దృష్టి పెట్టాలి. కొనుగోలు ప్రక్రియ తీరును పరిశీలించాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి దృష్టికొచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించాలి’ అని ఆదేశించారు.
ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్: ‘పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయాలి. వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి పరిష్కార చర్యలు తీసుకోవాలి. సాగుదారు హక్కు పత్రాల (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు)పై రైతులకు మరింత అవగాహన కల్పించాలి’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రోజుకు సగటున ధాన్యం కొనుగోళ్లు 42,237 మెట్రిక్ టన్నులకు చేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో శ్రీ సిమెంట్ కర్మాగారం
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ1,500 కోట్ల పెట్టుబడితో సిమెంట్ ప్లాంటును శ్రీ సిమెంట్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కంపెనీ ఎండీ హెచ్.ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ సోమవారం కలిశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. 9 రాష్ట్రాల్లో సిమెంట్, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్లను శ్రీ సిమెంట్ సంస్థ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని సీఎం కోరుకుంటున్నారని కంపెనీ ఎండీ హెచ్.ఎం.బంగూర్ పేర్కొన్నారు. ‘ఒక కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాదిరే రాష్ట్ర బాగోగుల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. దేశం కంటే రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉంది. అందుకే రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని ఆయన చెప్పారు. ప్లాంటు ఏర్పాటు వల్ల పారిశ్రామికాభివృద్ధితో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని జేఎండీ ప్రశాంత్ పేర్కొన్నారు.