ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో.. ఎంఐజీ లే-అవుట్‌ ఉండాలి: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. విశాఖలో తలపెట్టిన మెట్రోరైలు ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే-అవుట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎంఐజీ లేఅవుట్‌ ఉండాలి
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎంఐజీ లేఅవుట్‌ ఉండాలి

By

Published : May 9, 2022, 8:10 PM IST

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లేఅవుట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. లే అవుట్లకు అన్ని నియమ నిబంధనలు, ప్రమాణాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. వినియోగదారులకు ఎలాంటి న్యాయ వివాదాలు, ఇబ్బందులు లేకుండా క్లియర్‌ టైటిల్స్‌ ఉండాలన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కోసం ఇప్పటి వరకూ 82 అర్బన్‌ నియోజక వర్గాల్లో సుమారు 6,791 ఎకరాలు గుర్తించినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతి సహా మొత్తం 864.29 ఎకరాల్లో లే అవుట్‌ పనులు జరుగుతున్నాయన్నారు. మే చివరి నాటికి లే అవుట్లను సిద్ధం చేస్తామని సీఎంకు వివరించారు.

కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టిపెటాలని అధికారులను సీఎం ఆదేశించారు. గుంతలు లేని రోడ్లు కనిపించాలని.., నాడు–నేడు కింద బాగు చేసిన రోడ్లను చూపించాలని సీఎం ఆదేశించగా.. జూన్ ‌నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. అమరావతి ప్రాంతంలో పనులపైనా సీఎం జగన్ సమీక్షించారు. కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇప్పటికే విద్యుత్‌ స్తంభాలను తొలగించామని.., దీంతో పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపైనా దృష్టిపెట్టామన్న అధికారులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుపైనా సీఎం జగన్ సమీక్షించారు. వనరుల సమీకరణపై అధికారులతో సమాలోచనలు చేశారు. సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు చేశారు. మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలన్నారు. పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని సూచించారు. జగనన్న మహిళా మార్ట్‌లపైనా సమీక్షించిన సీఎం.. మహిళా స్వయం సహాయక సంఘాలతో మార్ట్​లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. వీలైనన్ని మహిళా మార్ట్‌లను నెలకొల్పాలని..దానికోసం వివిధ ప్రాంతాల్లో మంచి భవనాలను గుర్తించాలని ఆదేశించారు.

సమీక్షలో పారిశుద్ధ్య నిర్వహణపై చర్చించిన సీఎం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేశామన్న అధికారులు.. 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికి పంపిణీ చేస్తామన్నారు. 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. మిగిలినవి ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 1,123 ఈ–ఆటోలు కూడా జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టినట్లు సీఎంకు వివరించారు.

రోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలని, దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావం చూపకపోతే.. అవి అలానే ఉండిపోతాయని సీఎం వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్లపై సమీక్షించిన సీఎం.. రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్‌ చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. టిడ్కో ఇళ్లపై ఈ మూడేళ్లలో సుమారుగా 5,500 కోట్లు ఖర్చుచేశామన్న సీఎం.. రానున్న రోజుల్లో మరింత ఖర్చు చేస్తామన్నారు. సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్‌ సమీర్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details