సహకార బ్యాంకులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. సహకార శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై ఆరా తీశారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై చర్చించి అధికారులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు.
సహకార బ్యాంకులను కాపాడుకోవాలని సీఎం అన్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తుండటం వల్ల, ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. వెసులుబాటు మేరకు వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. బ్యాకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలన్నారు. ఈ పోటీని తట్టుకునేందుకు ఆర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వాలన్నారు. నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయని, మంచి ఎస్‌ఓపీలను పాటించేలా చూడాలని సీఎం నిర్దేశించారు. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలన్నారు. డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులకు మేలు జరుగుతుందన్నారు. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయని, రుణాలపై భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోందన్నారు. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపుకు తిప్పుకోవచ్చని, తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుందన్నారు.