రాష్ట్రంలో తొలి విడతలో 4,530 వైఎస్‌ఆర్ డిజిటల్ లైబ్రరీలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.140 కోట్లను వెచ్చించనున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ డిజిటల్ లైబ్రరీలపై క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. మొదటి విడత లైబ్రరీల నిర్మాణ పనులను ఆగస్టు 15న ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలి. కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్, డెస్క్‌టాప్ బార్‌కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ ఉండాలి.
స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. ప్రైమరీ, సెకండరీ విద్యతోపాటు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలుండాలి. ఇందులో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ ఉంచాలి. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. గ్రామాలకు నిరంతర, నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించాలి’ అని సీఎం నిర్దేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనరు గిరిజా శంకర్, ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ నంద కిషోర్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి