పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్లు(ఎంఐజీ) ఇచ్చేందుకు ఈ ఏడాది విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీలను ప్రకటించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ‘ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపించాలి. అన్ని పురపాలక సంఘాల్లో ఇవి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి నగరం, పురపాలక సంఘం ఉత్తమ పనితీరు కనబరిచి వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందిన నగరాల స్థాయికి చేరుకోవాలి’ అని అన్నారు. ఎంఐజీ పథకానికి సంబంధించి 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వీటి కోసం భూ గుర్తింపు, సేకరణ చేస్తున్నామని వివరించారు.
లబ్ధిదారులు చేపడుతున్న గృహ నిర్మాణ పనులు శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కాలనీల్లో 80%పైగా ప్రారంభమయ్యాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి కోసం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేశామని వెల్లడించారు. ఒక్కో ఇంటికి సామగ్రి కొనుగోలుకు రూ.32 వేలు ఆదా అయిందన్నారు. లబ్ధిదారుల సమ్మతి మేరకు సామగ్రిని పంపిణీ చేస్తామని, దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని చెప్పారు. మూడో ఆప్షన్ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించేందుకు వారిని గ్రూపులుగా చేస్తున్నామని వివరించారు.
డిసెంబరు 2021 నాటికి మొదటి విడతగా 85,888 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.రెండో విడత ఇళ్లు జూన్ 2022 నాటికి, మూడో విడత కింద చేపట్టే ఇళ్లు డిసెంబర్ 2022 నాటికి పూర్తవుతాయని నివేదించారు.