వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను జగన్ పరిశీలించారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం.. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వాటి ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించటంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వైద్య రంగంలో చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేశామన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు.
ఆరోగ్య ఆసరా కింద రోగులకు..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను కూడా గణనీయంగా పెంచామన్నారు. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను విద్య, వైద్య శాఖలకు అప్పగించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా తాను లక్ష్యాలను నిర్దేశిస్తానని.., వాటిని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలన్నారు. శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది లక్ష్యాలను ఛాలెంజ్‌గా స్వీకరించాలన్నారు. ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలని సీఎం సూచించారు.
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపైనా సీఎం జగన్ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని తెలిపారు. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్యుల సేవలు తప్పక అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైద్యుల జీతాలు పెంచామన్నారు. అందుకే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్షించారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని..,వసతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్దన్నారు.