ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN REVIEW: కంటి వెలుగుకు ప్రత్యేక డ్రైవ్ - cm jagan review on health department

వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య,ఆరోగ్య శాఖలో నాడు-నేడు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణాల పనులు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఇతర పథకాల అమలు తీరును బుధవారం ఆయన సమీక్షించారు.

cm jagan review on health deportment
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష

By

Published : Nov 10, 2021, 5:24 PM IST

Updated : Nov 11, 2021, 4:10 AM IST

వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య,ఆరోగ్య శాఖలో నాడు-నేడు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణాల పనులు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఇతర పథకాల అమలు తీరును బుధవారం ఆయన సమీక్షించారు. ‘కంటి వెలుగు పథకం కింద ఇప్పటివరకు పరీక్షలు చేయించుకోనివారికి వెంటనే పరీక్షలు చేయాలి. సమస్యలుంటే వెంటనే కళ్లద్దాలు అందజేయాలి. అవసరమైనవారికి శస్త్రచికిత్సలు నిర్వహించాలి. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, 104కు అనుసంధానించి పురోగతిని నిరంతరం పరిశీలించాలి. క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉచిత వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కర్నూలు, నంద్యాల, అనకాపల్లిల్లో కొత్త వైద్య కళాశాలలకు స్థలాల కేటాయింపుపై న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై విచారణ త్వరగా జరిగేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

కొవిడ్‌తో కంటి వెలుగుకు అవరోధం!

‘ఇప్పటి వరకు 66,17,613 మంది పిల్లలకు కంటి పరీక్షలు జరిగాయి. వీరిలో 1,58,227 మంది కళ్లద్దాలు ఇచ్చాం. 60 ఏళ్ల పైబడిన 13,58,173 మందికి పరీక్షలు జరిగాయి. ఇందులో 7,60,041 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి అందజేశాం. 1,00,223 మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. మరో 26,437 మందికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు చేయాలి. కొవిడ్‌తో కంటి వెలుగు కార్యక్రమానికి అవరోధం ఏర్పడింది.

12 జిల్లాలో 2% లోపే కొవిడ్‌ కేసులు

‘రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0 నుంచి 2%లోపు ఉంది. 23,457 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 27,311 డి-టైప్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు 15కి 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు పూర్తవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,17,71,458 మంది టీకా తొలిడోసు, 2,17,88,482 మంది రెండు డోసులు పొందారు’ అని అధికారులు వివరించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మార్చి నాటికి పీహెచ్‌సీలకు కొత్త భవనాలు

రాష్ట్రంలోని 16 కొత్త వైద్య కళాశాలల్లో ఇప్పటికే 4 కళాశాలల నిర్మాణాల పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల నిర్మాణాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. రాష్ట్రంలో 16 హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుకు ఇప్పటివరకు 13చోట్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. 10,011 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మరమ్మతులు డిసెంబరు నాటికి, 146 పీహెచ్‌సీల కొత్త భవనాల నిర్మాణ పనులు వచ్చే మార్చికల్లా పూర్తవుతాయి. హెల్త్‌ క్లినిక్స్‌ పనులకు ఇప్పటికే నిధులు అందజేశాం’ అని అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన 2,446 రకాల చికిత్సల ద్వారా రోజుకు సగటున 3,300 మంది లబ్ధి పొందుతున్నారని, బధిరులకు కూడా ట్రస్టు ద్వారా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆసరా కింద రూ.439 కోట్లు చెల్లించామన్నారు.

ఇదీ చదవండి..

petrol prices : రాష్ట్రంలో పెట్రోల్‌పై రూ.1.51, డీజిల్‌పై 2.22 మేర తగ్గిన వ్యాట్‌

Last Updated : Nov 11, 2021, 4:10 AM IST

ABOUT THE AUTHOR

...view details