ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: 'గంజాయి సాగుపై ఉక్కుపాదం' - గంజాయి న్యూస్

గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని, మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. పొరుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో విశాఖపట్నంలో సమన్వయ సమావేశం నిర్వహించాలని డీజీపీని ఆదేశించామన్నారు. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా తీసుకుని గంజాయి సాగు, రవాణాపై గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పామని వెల్లడించారు.

గంజాయి సాగుపై ఉక్కుపాదం
గంజాయి సాగుపై ఉక్కుపాదం

By

Published : Oct 28, 2021, 10:01 PM IST

Updated : Oct 29, 2021, 5:16 AM IST

‘ఈ మధ్యనే ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న గంజాయిని మన రాష్ట్రంలో పట్టుకున్నాం. ఏవోబీలో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దశాబ్దాలుగా గంజాయి సాగవుతోంది. కానీ, ఇప్పుడే మన ప్రభుత్వంలోనే గంజాయి సాగు మొదలైనట్లు ప్రతిపక్షం, చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. దిల్లీ వెళ్లి రాష్ట్రం మీద బురదజల్లుతున్నారు. గంజాయి సాగు నియంత్రణకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశాం. వాటితోపాటు ఎస్‌ఈబీ కూడా దాడులు చేస్తోంది. కాబట్టే లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. ఇన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే జాతీయ స్థాయిలో రాష్ట్ర మాదకద్రవ్యాల నియంత్రణ కొంతమేర సాధ్యమైంది. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. గురువారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో, తర్వాత మంత్రులతో ప్రత్యేక భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. గంజాయిపై తెదేపా అనవసర ప్రచారం చేస్తోందని మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన పై విధంగా స్పందించినట్లు తెలిసింది. చంద్రబాబు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులు అనడంతో ‘మనం ఎంత చెప్పినా, వాస్తవాలు వివరించినా ఆయన చేసేది అసత్య ప్రచారమే. దేవుడే చూసుకుంటాడు, ఆయనే శిక్షిస్తాడు’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశం వివరాలివీ.

వచ్చే నెలలో మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు!
మున్సిపల్‌ ఎన్నికల గురించి సీఎం జగన్‌ ప్రస్తావిస్తూ.. ‘ఒక కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాలి. ఇవిగాక కోర్టు కేసుల్లో కొన్ని ఉన్నాయి. న్యాయస్థానం అనుమతిస్తే వాటికి కూడా ఎన్నికలొస్తాయి. నవంబరులో వీటికి ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంది. నవంబరు 1, 2 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే అదే నెల 16 లేదా 17 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకుందాం. మున్సిపల్‌ ఎన్నికల పూర్తి బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులదే. అవసరమైతే ఇతర ఎమ్మెల్యే మద్దతూ తీసుకోండి. చాలా సీరియస్‌గా తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కలగజేసుకుంటూ ‘నెల్లూరు నగరపాలక సంస్థలో ఎన్నికలున్నాయి, అక్కడ పింఛన్లు కొత్తవి ఇవ్వాలి’ అని సీఎంను కోరారు. సీఎం స్పందిస్తూ.. ‘డిసెంబరులో, జూన్‌లో ఏడాదిలో ఇలా రెండుసార్లు కొత్తవి ఇద్దామని మనం విధాన నిర్ణయం తీసుకున్నాం కదా. ఇప్పుడు మీ దగ్గర ఎన్నికలున్నాయని ఒకసారి, ఇంకోసారి మరోచోట అంటే ఎలా? ఇప్పటికే అర్హుల జాబితా సిద్ధమై ఉంటుంది కదా. ఆ జాబితాను లబ్ధిదారులకు చూపించు. మీ అందరికీ డిసెంబరులో ఇస్తాం అని చెప్పు’ అని అన్నట్లు సమాచారం.

ఉగ్రవాద జాబితాలో తెదేపా లేదా?

మావోయిస్టు పార్టీలపై నిషేధాన్ని పొడిగించే అంశం చర్చకు వచ్చినప్పుడు..‘ఉగ్రవాద జాబితాలో తెదేపా లేదా’ అని మంత్రి బొత్స సత్యనారాయణ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీని కూడా నిషేధించాల్సింది.. అని మరో ఇద్దరు, ముగ్గురు మంత్రులు సరదాగా వ్యాఖ్యానించడంతో అందరూ నవ్వుకున్నారు. విశాఖపట్నంలో, పర్యాటక రంగంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ పెట్టుబడులను బాగా తీసుకువస్తున్నారని మంత్రి గౌతమ్‌రెడ్డి సీఎంతో అన్నారు. మంత్రి అవంతి ఆయా ప్రాజెక్టుల గురించి సమగ్రంగా వివరిస్తుండగా.. పక్కనున్న ఇతర మంత్రులు కొందరు ‘సార్‌, మీరు శీనన్నతో ప్రత్యేకంగా రివ్యూ తీసుకోండి’ అని సీఎంతో అనడంతో అందరూ నవ్వులు చిందించారు.

ఇదీ చదవండి

AP Cabinet decisions : కొత్తగా 4 వేల ఉద్యోగాలు.. ఆన్​లైన్​లో సినిమా టికెట్లు.. అమ్మఒడికి అది తప్పనిసరి

Last Updated : Oct 29, 2021, 5:16 AM IST

ABOUT THE AUTHOR

...view details