వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని.. వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్(cm jagan video conference) అధికారులను అదేశించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, వంటనూనె, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు, రూ.2వేలు ఇవ్వాలన్నారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకొని, వాలంటీర్ల సేవలను వినియోగించుకొని ప్రతి ఇంటికీ సాయం అందించాలన్నారు.
ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలని అధికారులను సీఎం ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని.. వారికి అందించే సేవల్లో ఎలాంటి లోటు రానివ్వకూడదని పేర్కొన్నారు. బాధితులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో రూ.2వేలు ఇవ్వాలన్నారు. విద్యుత్, తాగునీటి పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వరద బాధితులకు అందించాల్సిన సదుపాయాలపై సీఎం జగన్.. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కాల్ సెంటర్‌ను సంప్రదించండి..
వరదలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 104 కాల్ సెంటర్‌ను సంప్రదించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 104కు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు. జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించాలని, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు డిజైన్లు రూపొందించి, శాశ్వత పనులు చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారు చేసి పనులు మొదలయ్యేలా పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. వారికి వెంటనే నగదు సాయం అందించాలని, ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే బాధితులకు రూ. 95,100 అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200 వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించాం. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలి. వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. బాధితుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం వెంటనే అందించాలి. వారంతా విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాడానికే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామం. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి’’