ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయుల సేవలను ఆ కార్యక్రమాల్లో వినియోగించుకోవద్దు: సీఎం జగన్ - విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

మార్చి 15 నుంచి నాడు-నేడు రెండో విడత పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, ఒక మహిళా జూనియర్‌ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం స్పష్టం చేశారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : Mar 9, 2022, 4:30 PM IST

Updated : Mar 9, 2022, 8:54 PM IST

ఉపాధ్యాయుల సేవలను బోధనేతర కార్యక్రమాలకు.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. మ్యాపింగ్, సబ్జెక్టులవారీ టీచర్లు, ఆంగ్ల బోధన, డిజిటల్‌ లెర్నింగ్‌, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.

నూతన విద్యావిధానానికి అనుగుణంగా పాఠశాలల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిరోజూ ఒక ఇంగ్లీషు పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఏడాది 8 వ తరగతి నుంచి డిజిటల్‌ లెర్నింగ్ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, ఒక మహిళా జూనియర్‌ కళాశాల ఉండేలా కార్యచరణ రూపొందించాలన్నారు. జూనియర్‌ కళాశాలలు లేని మండలాలను గుర్తించాలని, స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలన్నారు.

డిజిటల్‌ లెర్నింగ్‌పైనా సమీక్షించిన సీఎం.. లెర్నింగ్‌ టు లెర్న్‌ కాన్పెప్ట్‌లోకి తీసుకెళ్లాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు-నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. పాఠశాలల్లో సమస్యలపై ఎప్పుడు ఫిర్యాదు అందినా.. వారం రోజుల్లోగా పరిష్కారం కావాలన్నారు. మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు – నేడు రెండో విడత మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి మ్యాపింగ్‌ చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలన్నారు.

రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్‌ కాలేజీతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ సమ్మిళతంగా ఒక స్కిల్‌ సెంటర్‌ ఉండాలన్నారు. వీటన్నింటికీ పాఠ్యప్రణాళికను స్కిల్‌ యూనివర్శిటీ రూపొందించాలని సూచించారు. దీన్ని తిరుపతిలో పెడతామని ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని.., యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. నైపుణ్యం ఉన్న మానవవనరులకు చిరునామాగా రాష్ట్రం ఉండాలన్నారు.

"టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాల్లో వాడకూడదు. టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. కొత్త జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఉండాలి. ప్రస్తుత కేంద్రాల్లో కూడా వసతులు మెరుగుపరచాలి. ఈ నెల 15 నుంచి బడుల్లో నాడు-నేడు రెండోవిడత పనులు. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. బడులు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలి. నైపుణ్యాల అభివృద్ధి ప్రణాళికను వెంటనే ఆచరణలోకి తేవాలి. నైపుణ్య మానవ వనరుల చిరునామాగా ఏపీ తయారుకావాలి." - జగన్‌, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి :
MLC Candidate: వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. మహమ్మద్ రుహుల్లా

Last Updated : Mar 9, 2022, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details