ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cm review: పోలీస్‌ నియామకాలు వచ్చే ఏడాది - మాదకద్రవ్య రహితంగా కళాశాలలు, వర్సిటీలు వార్తలు

రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలన్నింటిని మ్యాపింగ్‌ చేసి అక్కడ డ్రగ్స్‌ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే.. పంపిణీదారులెవరు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? వంటి మూలాల్ని ఛేదించి అడ్డుకట్ట వేయాలని సూచించారు.

మాదకద్రవ్య రహితంగా కళాశాలలు, వర్సిటీలు
మాదకద్రవ్య రహితంగా కళాశాలలు, వర్సిటీలు

By

Published : Oct 4, 2021, 6:43 PM IST

Updated : Oct 5, 2021, 4:10 AM IST

రాష్ట్రంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలన్నింటిని మ్యాపింగ్‌ చేసి అక్కడ డ్రగ్స్‌ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే.. పంపిణీదారులెవరు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? వంటి మూలాల్ని ఛేదించి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు ఈ అంశాన్ని సవాల్‌గా తీసుకొని.. ప్రతి నాలుగు వారాలకోసారి తనకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని మాదకద్రవ్యాల కేసులో ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ, పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయటమే వారి లక్ష్యం. వీటిపై అప్రమత్తంగా ఉండాల’ని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఇంకేమన్నారంటే..

దిశ బిల్లు ఇన్ని రోజులుగా పెండింగ్‌లోనా?

*దిశ బిల్లును శాసనసభలో ఆమోదించి ఇన్ని రోజులైనా.. పెండింగ్‌లో ఉండటం సరికాదు. వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలి. డౌన్‌లోడ్‌, వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’ సమర్థంగా అమలుపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలి.

*అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాలి. ఘటన జరిగిన నెల రోజుల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. ఎక్కడైనా ఆలస్యమైతే సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వండి.

*పోక్సో కేసులు, మహిళలపై జరిగే నేరాల విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాల్లో ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదుల్ని నియమించాలి. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పనితీరుపై నిరంతరం సమీక్షించాలి.

*సైబర్‌ నేరాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఆ విభాగంలో సమర్థులైన అధికారులు, న్యాయవాదుల్ని నియమించాలి.

*ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలి. ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య పెరుగుతుందని వెనుకడుగు వేయొద్దు. వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

*గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు డిసెంబరు నాటికి శిక్షణ పూర్తిచేయాలి. వచ్చే ఏడాది కనీసం ఆరేడు వేల మంది పోలీసు సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలి.

*అధికారంలోకి రాగానే 43 వేల మద్యం బెల్ట్‌షాపులు తొలగించాం. మూడో వంతు దుకాణాలు తగ్గించాం. అమ్మకాల వేళలు కుదించాం. రేట్లు పెంచాం. వినియోగం తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. మద్యం అక్రమ రవాణా, సారా తయారీని అరికట్టడంపై అధికారులు దృష్టిపెట్టాలి. ఇసుక అక్రమ రవాణా, గుట్కా నిషేధానికి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావాలి’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అధికారులు మాట్లాడుతూ ‘దిశయాప్‌ను 74,13,562 మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా, ఇప్పటికే 5,238 మంది సాయం పొందారని తెలిపారు. ‘నేరాలకు ఆస్కారమున్న ప్రాంతాల్ని మ్యాపింగ్‌ చేశాం. మహిళలపై జరిగే నేరాల్లో ఒక్కో కేసు దర్యాప్తునకు 2017లో సగటున 189 రోజుల సమయం పడితే.. ఫోరెన్సిక్‌ సదుపాయాలు పెరిగినందున 2021లో 42 రోజుల్లోనే ఛార్జిషీట్లు వేస్తున్నాం. గతంలో డీఎన్‌ఏ నివేదికకు ఏడాది పట్టేది. ఇప్పుడు రెండు రోజుల్లో వస్తోంది. ఈ కేసుల్లో ఏడు రోజుల్లో ఛార్జిషీటు వేస్తున్నామ’ని వివరించారు.

నేడు ‘స్వేచ్ఛ’కు శ్రీకారం

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్‌కిన్లు అందిస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు వీటిని ఇస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్లలో బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు విక్రయిస్తారు. రూ.31.48 కోట్ల వ్యయంతో పీ అండ్‌ జీ, నైన్‌ బ్రాండ్లకు చెందిన శానిటరీ న్యాప్‌కిన్లను ఇవ్వనున్నారు. యునిసెఫ్‌, పీఅండ్‌జీ వారి సమన్వయంతో రుతస్రావ సమయంలో పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

11న తిరుమల, 12న కనకదుర్గ ఆలయాలకు సీఎం జగన్‌

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ గరుడసేవ రోజున ముఖ్యమంత్రి జగన్‌ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరగనున్న నవరాత్రి ఉత్సవాల్లో ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొని..కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

ఇదీ చదవండి

SUICIDE ATTEMPT: హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం...ఎందుకంటే..!

Last Updated : Oct 5, 2021, 4:10 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details