'కొవిడ్ పరీక్షల్లో మన రికార్డులు మనమే బద్దలు కొడుతున్నాం. ఇప్పుడు చికిత్సకు అవసరమైనట్లుగా పడకల సంఖ్య మరింత పెంచాలి. చికిత్స అందించేందుకు తీసుకున్న అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలి. ఎక్కడా తేడా రాకూడదు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రులతో సహా అన్నిచోట్లా కొవిడ్ చికిత్స ఒకేలా ఉండాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే(ఎంప్యానెల్) ఆసుపత్రులతోపాటు, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ఎంప్యానెల్ ఆసుపత్రుల్లోనూ సగం పడకలను ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసేందుకు ఇవ్వాలి' అని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు నిర్దేశించారు.
'అన్ని కొవిడ్ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం, వైద్యులు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్.. ఈ అయిదూ ఉండేలా చూసుకోవాలి. వైద్యులు లేకుంటే వెంటనే నియమించాలి' అని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్ పరిస్థితులపై అధికారులతో గురువారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
- ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు కొవిడ్ రోగులకు కేటాయించారన్న దానిపై పూర్తి స్పష్టతకు రావాలి. దీనివల్ల మొత్తం కొవిడ్ చికిత్సకు ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? ఎక్కడెక్కడ అవి ఉన్నాయో తెలుస్తుంది.
- కొవిడ్ రోగులకు వైద్యమంతా ఉచితంగా అందాలి. ఆసుపత్రులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ వస్తే బాధితులు ఉన్న ప్రాంతాన్ని బట్టి జిల్లా యంత్రాంగం స్పందించి ఆయా ఆసుపత్రుల్లో వారిని చేర్పించాలి. ఫోన్ వచ్చిన 3 గంటల్లో పడక కేటాయించాలి. అలా చేయలేకపోతే కారణాలు గుర్తించాలి.
- అన్ని కొవిడ్ ఆసుపత్రుల సమీపంలోనే కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఇక్కడి వైద్యులే అక్కడ కూడా సేవలందించేందుకు వీలుంటుంది. కేర్ సెంటర్లలో అన్ని వసతులూ ఉండాలి.
- ఆక్సిజన్ సరఫరా, నిల్వలో ఎక్కడా లోపం తలెత్తవద్దు. కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ట్యాంకర్లు వచ్చేలా కృషి చేయాలి. ప్రతి బోధనాసుపత్రి వద్ద 10కేఎల్ సామర్థ్యం, ఇతర ఆసుపత్రుల వద్ద ఒక కేఎల్ సామర్థ్యంతో ఆక్సిజన్ నిల్వ చేసుకోవాలి. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్ కావాలంటే ఏం చేయాలో ఆలోచించండి. సరఫరా, నిల్వ ఎలా అన్నది చూడండి.
ఆక్సిజన్ డిమాండ్ వెయ్యి మెట్రిక్ టన్నులకు..
రాష్ట్రంలో పడకలు, వసతులతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వారు ఏమన్నారంటే..