CM Jagan Review On Corona: కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత బూస్టర్ డోసు (ప్రికాషస్ డోస్) పొందేందుకు విధించిన 9 నెలల గడువును 6 నెలలకు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. సీఎం జగన్ అధ్యక్షతన కొవిడ్ నియంత్రణ చర్యలపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో బూస్టర్ డోసు పొందేందుకు ఉన్న గడువును తగ్గించడంవల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లు, అత్యవసర సర్వీసులు అందించేవారు చాలామందిని కొవిడ్ బారి నుంచి కాపాడేందుకు అవకాశం ఉంటుందన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు కేంద్రానికి సీఎం లేఖ రాయాలని సమావేశంలో తీర్మానించారు.
ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ రెండో డోసు టీకా పంపిణీలో పురోగతి తక్కువగా ఉన్న ఐదు జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్స వివరాలు, అత్యవసర సమయాల్లో ఆస్పత్రుల్లో సేవలు పొందేందుకు ఎవరిని, ఎక్కడ సంప్రదించాలన్న దానిపై ప్రజల్లో అవగాహన కలిగేలా విలేజ్ క్లినిక్‌లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో హోర్డింగులు ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘104, 108 సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వైద్యులనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. దీనికోసం రూపొందించే యాప్ ద్వారా, 108కు ఫోన్ చేసినా, ఆరోగ్యమిత్ర చెప్పినా ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో చికిత్స జరిగేలా చూడాలి. ఇందుకు కృత్రిమ మేధ వినియోగంపైనా దృష్టిపెట్టాలి. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇళ్లకు వెళ్లాక వారి ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎం ఆరా తీయాలి. 14 కాల్‌సెంటర్ పనితీరును పటిష్ఠం చేయాలి. టెలిమెడిసిన్ ద్వారా బాధితులకు చికిత్సకు సంబంధించిన సలహాలు, సూచనలు పక్కాగా అందేలా చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు.
నియోజకవర్గానికో కొవిడ్ సంరక్షణ కేంద్రం: అధికారులు