ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan On Paddy Crop: అక్కడ వరికి బదులు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

Jagan On Agriculture: రాష్ట్రంలో బోర్ల కింద వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వరి బదులుగా అంతే ఆదాయాన్నిచ్చే చిరుధాన్యాలు సాగు చేయాలన్న సీఎం.. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. చిరు ధాన్యాలకు మద్దతు ధర కల్పించేందుకు మిల్లెట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు కల్తీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మిన వారిపై చట్టాలను చక్కదిద్దైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అక్కడ వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
అక్కడ వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

By

Published : Dec 6, 2021, 5:35 PM IST

Updated : Dec 7, 2021, 5:01 AM IST

CM Jagan On Paddy Crop: వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షించిన సీఎం జగన్‌...బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరుధాన్యాల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. వాటిని అధికంగా పండించే ప్రాంతాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా చూడాలని సూచించారు. ‘ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం) యూనిట్‌గా.. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వాటిలో ఏర్పాటు చేసే అద్దె యంత్ర కేంద్రాల్లో సేంద్రియ సాగుకు పనికొచ్చే పరికరాలు ఉంచాలి’ అని పేర్కొన్నారు.

కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే రెండేళ్ల జైలు

‘రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్ని రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి. రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయాలి. అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీకేలను నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిని తొలగించడమే కాకుండా.. చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వ్యాపారులపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్గానిక్‌ పాల మార్కెటింగ్‌పై దృష్టి పెట్టి, రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పశువులకు సేంద్రియ దాణా అందుబాటులో ఉంచాలని, ఆర్గానిక్‌ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం జిల్లాకో యూనిట్‌ ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో 45.35 లక్షల మంది రైతులకు చెందిన 1.12 కోట్ల ఎకరాలను ఈ-క్రాప్‌ చేశామని, రబీలోనూ ప్రక్రియ మొదలైందని అధికారులు చెప్పారు.

కృష్ణా, అనంతపురంలో పాలవెల్లువ

కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాల వెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. రోజువారీ పాల సేకరణ గతేడాది నవంబరులో 2,812 లీటర్లు ఉంటే.. ఈ ఏడాది నవంబరులో 71,911 లీటర్లకు పెరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.32 కోట్ల లీటర్ల పాలను సేకరించామని చెప్పారు. సమావేశంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ఛైర్మన్‌ నాగిరెడ్డి, వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డితోపాటు అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్ బాటలో జగన్..?
Telangana CM KCR On Paddy Purchase: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన ఇప్పటికే ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. హస్తిన వెళ్లి కేంద్ర మంత్రులను కూడా కలిశారు.

పారాబాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం, భారత ఆహార సంస్థ (FCI) చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో యాసంగిలో సాగయ్యే వరిధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేయవద్దని రైతులకు సూచించిన కేసీఆర్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. సొంతంగా అమ్ముకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చన్నారు. మొత్తం ధాన్యం సేకరణ, నిల్వ శక్తి రాష్ట్రానికి లేదన్నారు. కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

తాజాగా.. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్ కూడా కేసీఆర్​ బాటలో కేంద్రంపై పోరుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరికి బదులు పత్యామ్మాయ పంటలు వేయాలన్న సీఎం జగన్ నిర్ణయంతో వరి పండించే రైతులు అయోమయానికి గురవుతున్నారు.

సంబంధిత కథనాలు

KCR ON YASANGI CROP: 'యాసంగి పంటకు.. కొనుగోలు కేంద్రాలు ఉండవు'

KCR fires on Central Government: 'మా ఓపికకు ఓ హద్దుంటుంది... వడ్లు కొంటరా.. కొనరా..? '

TRS Maha Dharna: ఈనెల 18న ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్​ వద్ద తెరాస మహాధర్నా

Last Updated : Dec 7, 2021, 5:01 AM IST

ABOUT THE AUTHOR

...view details