పశుసంవర్ధక, వ్యవసాయ, అనుబంధ రంగాల బలోపేతంపై సీఎం జగన్..తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి...డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ప్లాట్‌ఫాంలు, గోడౌన్లు, హార్టికల్చర్ మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్ల వంటి..15 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గాల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ జరగాలన్నారు.
తొలిదశలో 3,250 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయగా..రెండో దశ కింద సెప్టెంబరు నాటికి మరో 3,250 ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మూడో దశలో డిసెంబరు నాటికి 4,250 కమ్యూనిటీ సెంటర్లు, 535 హార్వెస్టర్లు, 85 హబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. మొత్తంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటైతే...వ్యవసాయ ఉపకరణాలు తక్కువ ఖర్చుకే రైతులకు అందుబాటులోకి వస్తాయని, కూలీల కొరత సమస్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఏ యంత్ర పరికరం ఎంత అద్దెకు లభ్యమవుతుందో..ఆర్బీకేల్లో ప్రదర్శించాలన్నారు. వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యాలు పెంచేందుకు..ఐటీఐ, పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్‌లో కోర్సులు ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. తద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణపై నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయన్నారు.
రాష్ట్రంలో 33 చోట్ల సీడ్ కం మిల్లెట్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్..,ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. కొన్నిచోట్ల అవసరాన్నిబట్టి ఒకటికి మించి నెలకొల్పాలన్నారు. మత్స్యశాఖపైనా సమీక్షించిన సీఎం..2022 సెప్టెంబరు నెలాఖరుకు చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల ఫాంలు, ఆర్గానిక్ డెయిరీలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.