ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan : 'జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలి'

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు

By

Published : Nov 15, 2021, 5:26 PM IST

Updated : Nov 15, 2021, 7:39 PM IST

17:20 November 15

రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 46 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేయాలని, విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. 2022 జూన్‌ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తికావాలన్న సీఎం... రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మతులు ఒక డ్రైవ్‌లా చేయాలన్నారు.

తక్షణమే మరమ్మతులు చేయాలి...

సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో పురపాలక పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో రహదారులపై ముందుగా గుంతలు పూడ్చి, తర్వాత కార్పెటింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా పాట్‌ హోల్స్‌ మిగిలిపోకూడదని, అన్ని రోడ్ల మీద అన్ని చోట్లా గుంతలు పూడ్చాలని సూచించారు. పాట్‌ హోల్‌ ఫ్రీ చేయడానికి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాల వల్ల రోడ్ల మరమ్మతుల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో రహదారులన్నింటికీ తక్షణమే మరమ్మతులు చేయాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.  

 

విమర్శించే అవకాశం ఉండకూడదు..

గరిష్ఠంగా డ్యామేజ్‌ అయిన రోడ్ల మరమ్మతులపై వెంటనే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రోడ్లకు మరమ్మతులు చేసిన తర్వాత తేడా కనిపించాలని, ఫలితంగా మరొకరు విమర్శించే అవకాశం ఉండకూడదన్నారు. ఈ నెలాఖరికల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులు వెంటనే మొదలుపెడుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకోవాలని, ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బ్రిడ్జ్​లు, ఫ్లై ఓవర్‌లు, ఆర్‌వోబీలను ఫేజ్‌ 1 పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

నోటీసులు ఇవ్వాలి...

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని, దీనిపై అధికారులు సీరియస్‌గా స్పందించాలని సీఎం సూచించారు. వారంలోపు పనులు ప్రారంభించకపోతే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామంటూ నోటీసులు ఇవ్వాలన్నారు. మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ సహా ఏ రోడ్డు అయినా , ఎవరి పరిధిలో ఉన్నా వెంటనే మరమ్మతులు చేయాలనన్నారు. మున్సిపాలిటీలలో, కార్పొరేషన్‌లలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నారు.  

కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి...

నాడు - నేడు తరహాలో ముందుగా ప్రతీ రోడ్డు రోడ్లు రిపేర్‌ చేసేముందు, మరమ్మతులు చేసిన తర్వాత ఫోటోలు తీయాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్‌ మీద ముందు దృష్టి పెట్టాలని, నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలన్నారు. 2022 జూన్‌కల్లా రాష్ట్రంలో రహదారులన్నీ మరమ్మత్తులు పూర్తి కావాలన్నారు. పంచాయతీల పరిధిలోని రోడ్ల మరమ్మత్తులు పూర్తవ్వాలన్నారు. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

రోడ్లపై ఉన్న గుంతలను తక్షణం పూడ్చాలి. రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలి. వాహనదారులకు చక్కటి రోడ్లను అందుబాటులోకి తేవాలి. టెండర్లు దక్కించుకుని పని ప్రారంభించని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలి. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్తాం.      - వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  

ఇదీ చదవండి:Municipal Elections: దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు నిద్రపోతున్నారా ?: సజ్జల

Last Updated : Nov 15, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details