ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ప్రయోజనాలు వివరిస్తూ.. రైతులకు లేఖలు రాయాలి: సీఎం జగన్​ - jagan latest news

CM REVIEW: వ్యవసాయ మెటార్లకు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని విద్యుత్‌ రంగంపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ వల్ల .. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయిన విషయం రైతులకు వివరించాలన్నారు.

CM REVIEW
CM REVIEW

By

Published : Jul 28, 2022, 4:28 PM IST

Updated : Jul 29, 2022, 4:05 AM IST

CM REVIEW: వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడంపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల చేకూరే ప్రయోజనమేంటో రైతులకు వివరించాలని, వారికి లేఖలు రాయాలని ఆదేశించారు. విద్యుత్‌శాఖపై సీఎం జగన్‌ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయాన్ని వారికి వివరించాలన్నారు. ‘‘శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు ఎలా విజయవంతమైందో వివరించండి. దాని వల్ల 33.75 మిలియన్‌ యూనిట్‌ల విద్యుత్‌ ఆదా అయిన విషయాన్ని, రైతులకు జరిగిన మేలుని వివరించండి…’’ అని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే మంజూరు చేయాలని, ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైనా వెంటనే మార్చాలని చెప్పారు.

డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. ‘విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో నడిచేలా చూసుకోవాలి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహణలోని సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి. కృష్ణపట్నం ఓడరేవు సమీపంలోనే విద్యుత్‌ ప్లాంటు ఉంది కాబట్టి.... నౌకల ద్వారా దిగుమతి చేసుకునే బొగ్గుతో అక్కడ పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలి. దానివల్ల రవాణా ఖర్చులు కలిసొస్తాయి. మిగతా ప్లాంట్లతో పోలిస్తే ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. సింగరేణి నుంచి అవసరమైన మేరకు బొగ్గు సరఫరా జరిగేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్‌ స్వాపింగ్‌ వంటి వినూత్న ఆలోచనలూ చేయాలి’ అని సీఎం నిర్దేశించారు.

పోలవరం విద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణాన్ని 2024 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యంగల 9 యూనిట్‌ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకి డిసెంబరులోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంప్‌సెట్‌లకూ కరెంటు ఇస్తామన్నారు. జగనన్న కాలనీల్లో ప్రతి ఇంటికీ కరెంటు సరఫరాకు తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు.

గడచిన వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా గణాంకాల్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా కరెంట్‌ కొరత ఉన్న రోజుల్లో వినియోగదారుల్ని దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్‌ కొనుగోలు చేసినట్టు తెలిపారు. కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంట్‌ యూనిట్‌-3 సెప్టెంబరు నుంచి, విజయవాడ థర్మల్‌ప్లాంట్‌ ఐదో దశ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ రెండు యూనిట్‌ల ద్వారా అదనంగా 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఏటా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు సరఫరా ఉండటం లేదని అధికారులు వివరించారు. పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టులపై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 29, 2022, 4:05 AM IST

ABOUT THE AUTHOR

...view details