ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పింగళి రూపొందించిన జెండా భారతీయుల గుండె - har ghar tiranga

JAGAN AT INDEPENDENCE DAY జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామికి ప్రతీక అని సీఎం జగన్​ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.

JAGAN AT INDEPENDENCE DAY
JAGAN AT INDEPENDENCE DAY

By

Published : Aug 15, 2022, 10:29 AM IST

Updated : Aug 15, 2022, 11:40 AM IST

CM JAGAN జాతీయ జెండా మనందరి స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని సీఎం జగన్‌ అన్నారు. అతివాదం, మితవాదం, విప్లవ వాదం.. ఇలా మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని.. అదే స్వాతంత్య్రమని చెప్పారు. అహింసే ఆయుధంగా.. సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం భారత దేశానికే కాకుండా ప్రపంచ మానవాళకి మహోన్నత చరిత్రగా.. తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

‘‘పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాది మంది భారతీయుల గుండె. ఈ ఏడాది భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకొంటున్న సమయం. మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతమైనది. ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది. స్వాతంత్య్రం నాటికి 18 శాతం వ్యవసాయ భూమికి నీరందిస్తే.. ప్రస్తుతం అది 9 శాతానికి చేరింది. ప్రపంచ ఫార్మా రంగంలో ఇవాళ దేశం మూడో స్థానంలో ఉంది. దేశం దిగుమతుల నుంచి ఎగుమతులకు వేగంగా అడుగులు వేసింది. ప్రపంచంతో పోటీపడి గణనీయంగా అభివృద్ధి సాధిస్తున్నాం. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశాం. 150 దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలుగుతున్నాం’’ - ముఖ్యమంత్రి జగన్

ప్రజలకు చేరువగా గ్రామ, వార్డు సచివాలయాలు: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రజలకు చేరువ చేశామని జగన్​ తెలిపారు. సూర్యోదయానికి ముందే ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామని వెల్లడించారు. వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ఆర్బీకేలు తీసుకొచ్చామన్నారు. ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు తీసుకొచ్చామని తెలిపారు. మూడేళ్ల కాలంలో పౌరసేవల్లో మార్పు తీసుకొచ్చామని.. పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని అన్నారు. అన్నం పెట్టే రైతన్నకు అండగా వైఎస్సార్‌ రైతుభరోసా తీసుకొచ్చామని.. 52 లక్షల రైతన్నల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలు సొంత ఇళ్లు లేదని దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే చాలామంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు అందజేశామని తెలిపారు. ఇప్పటికే వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని.. ఇంటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామన్నారు.

నిరుపేద పిల్లలకు సైతం.. విద్య: పిల్లల చదువుతోనే పేదల తలరాత మార్చాలనుకున్నామని.. అందుకోసం విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చి పిల్లల తలరాత మారుస్తున్నామన్నారు. నిరుపేద పిల్లలకు విద్యను అందిస్తున్నామని..వారి చదువులకు అయ్యే ఖర్చును కూడా భరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామన్నారు. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని.. ఆరోగ్యశ్రీ పథకం కింద మరిన్ని సేవలు చేరుస్తున్నామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. మరో 16 వైద్య భోదనాస్పత్రుల నిర్మాణం జరగబోతోందని తెలిపారు.

అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం: ప్రభుత్వ బడులను, ఆస్పత్రులను మెరుగుదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. ఈ మూడేళ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని.. రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా దన్నుగా ఉంటున్నామన్నారు. మహిళా, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి.. సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలదే అగ్రస్థానమని.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశామని.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత మనదేనని తెలిపారు.

గడపగడపకు ఫలాలు: ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు బాగుండటమే రాష్ట్రాభివృద్ధి అని నమ్మామన్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం చూడకుండా అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి కమీషన్లకు తావులేకుండా అర్హులందరి ఖాతాల్లో నగదు జమ చేశామని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలుచేశామని వెల్లడించారు. పేదవాడిని దృష్టిలో ఉంచుకునే ప్రతి ఆలోచన, అడుగు ముందుకేశామని.. ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ గడపగడపకు ఫలాలు అందిస్తున్నామన్నారు.

పింగళి రూపొందించిన జెండా భారతీయుల గుండె

ఇవీ చదవండి:

Last Updated : Aug 15, 2022, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details