ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం పని చేస్తున్నాం: సీఎం జగన్​

CM Jagan on Education: ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో...మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో గురపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన...టీచర్ల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంటే...ప్రతిపక్షం టీచర్లను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని సీఎం ఆరోపించారు.

CM Jagan
సీఎం జగన్‌

By

Published : Sep 5, 2022, 2:20 PM IST

Updated : Sep 6, 2022, 6:24 AM IST

Teachers day Celebrations: మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుత శిల్పంలా మారుతుందని....అలాంటి గొప్ప శిల్పులే మన ఉపాధ్యాయులని సీఎం జగన్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి నివాళులర్పించి... ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంతో పోటీ పడలేని.. రుద్దపడిన విద్యను మాత్రమే చదువుకుంటున్న నిరుపేదల విద్యార్థుల పరిస్థితిని మార్చేందుకు....ప్రభుత్వం మూడేళ్లుగా అనేక చర్యలు తీసుకుందని సీఎం తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పెంచేందుకు.... నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. పేదల పిల్లలు మాత్రమే కాకుండా టీచర్ల పిల్లలు కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ అడగకుండానే పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచామన్న సీఎం....టీచర్లకు పదోన్నతులు ఇచ్చామన్నారు. పింఛన్ల విషయంలోనూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు.

"గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. చదువు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుత శిల్పంగా మారుతుంది. అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. టీచర్లు.. విద్యార్థులకు సబ్జెక్ట్‌తో పాటు వివేకాన్ని కూడా పెంచుతారు. గురువులు.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధిస్తారు. ఉపాధ్యాయులను గొప్పగా గౌరవించాలి. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. విద్యార్థులు తనకంటే గొప్పవాళ్లు కావాలని టీచర్‌ ఆరాటపడుతుంటారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులో ఉండాలి. పేదరికం... చదువుకు అడ్డుకాకూడదు. ఎవరూ అడగకపోయినా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాం. ఎస్జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాం. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం." -సీఎం జగన్​

Awards to Teachers: 176 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్‌ అందజేశారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వేడుకల్ని బహిష్కరించడంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. చేతి రుమాళ్లు, పెన్నులు, పేపర్లను సభలోకి అనుమతించని పోలీసులు... నల్ల చొక్కాలు, నల్ల చేతిరుమాళ్లు, నల్ల మాస్క్‌లను ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల చేతి రుమాళ్లు, నల్ల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకల్లో సీఎం జగన్​ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చేస్తారన్న హెచ్చరికలతో పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. సీఎం ఎదురుగా నిరసనలు లేకుండా పోలీసుల పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నవారినే సభా మందిరంలోకి పంపారు. టీచర్ల చేతి రుమాళ్లు, పెన్నులు, పేపర్లను సభలోకి అనుమతించలేదు. తనిఖీ కేంద్రం వద్దే గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నల్ల చొక్కా ధరించిన వారిని సభలోకి అనుమతించలేదు. సభా ప్రాంగణానికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెద్దఎత్తున తరలివచ్చారు. ఉపాధ్యాయుల హాజరుపై సందిగ్ధంతో సచివాలయ ఉద్యోగుల తరలించారు. ఉపాధ్యాయులు రావడంతో సచివాలయ సిబ్బందిని అధికారులు వెనక్కిపంపారు.

మరోవైపు జగన్‌ పాల్గొనే ప్రతి సభలోనూ పోలీసులు... ఈ-తరహా విధానం అమలు చేస్తున్నారు. టీచర్ల చేతి రుమాళ్లు, పెన్నులు, ప్లకార్డులు, పేపర్లను సభలోకి అనుమతించడం లేదు. నల్ల చొక్కాలు, నల్ల చేతిరుమాలు, నల్ల మాస్క్‌లను ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నల్ల చొక్కాలు తొలగిస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. నల్ల చేతి రుమాలు, నల్ల మాస్కులను స్వాధీనం చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం పని చేస్తున్నాం: సీఎం జగన్​

ఇవీ చదవండి:

Last Updated : Sep 6, 2022, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details