ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏ రాష్ట్రమూ.. ఇంత దగా పడలేదు: సీఎం జగన్‌ - ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు 2019

తెలుగు రాష్ట్రాలు విడిపోతాయ‌ని ఎప్పుడూ ఊహించ‌లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ప్ర‌స్తుతం ద‌గాబ‌డ్డ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉందని... అయినా వెన‌క‌డుగు వేయ‌కుండా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని చెప్పారు.

cm jagan

By

Published : Nov 1, 2019, 8:26 PM IST

Updated : Nov 1, 2019, 8:56 PM IST

ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం

ఆంధ్ర రాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని సీఎం జగన్‌ అన్నారు. దేశం, రాష్ట్రం కోసం పోరాడిన అంద‌రినీ స్మ‌రించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు జ‌రుపుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ... ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవటం గర్వంగా ఉందని చెప్పారు. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు చేసిన శ్ర‌మ‌, ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌లోనే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. వైయ‌స్ఆర్ ఉన్నంత కాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయ‌ని ఎప్పుడూ ఊహించ‌లేదని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని జగన్‌ పిలుపునిచ్చారు.

ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం గర్వకారణం
గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్ప నేల ఆంధ్రప్రదేశ్‌ అని.. స్వాతంత్య్రోద్యమంలో ఈ రాష్ట్రానిది కీలక పాత్ర అంటూ కొనియాడారు. ఎంతోమంది మహానుభావులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నమయ్యారని చెప్పారు. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారని గవర్నర్‌ గుర్తు చేశారు. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి చరిత్రలో నిలిచారని బిశ్వభూషణ్‌ కొనియాడారు.

అంతకుముందుమైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్​ను సీఎం జగన్ పరిశీలించారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ప్రసంగంఅనంతరం గవర్నర్​తో సహా సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

Last Updated : Nov 1, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details