ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరకట్ట పనులను సకాలంలో పూర్తిచేయండి: సీఎం జగన్​ - cm jagan news

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు​ శంకుస్థాపన చేసిన సీఎం జగన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సుమారు 15 కిలో మీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డుకు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, శ్రేణులు పెద్దఎత్తున్న పాల్గొన్నారు.

KRISHNA KARAKATTA WORKS
కరకట్ట పనులను సకాలంలో పూర్తిచేయండి

By

Published : Jul 1, 2021, 5:15 AM IST

కరకట్ట విస్తరణ పనులను పూర్తి నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని జల వనరులశాఖ అధికారులు, గుత్త సంస్థ ప్రతినిధులకు సీఎం జగన్‌ సూచించారు. కృష్ణా పశ్చిమ కాలువపై ప్రస్తుతం ఉన్న వంతెన ఇరుకుగా మారినందున మరొకటి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానది కుడికట్ట విస్తరణ పనులకు సీఎం జగన్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గర బుధవారం శంకుస్థాపన చేశారు.

150 కోట్లతో రెండు వరసల రోడ్డు నిర్మాణం..

రూ.150 కోట్లతో తాడేపల్లిలోని కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. పొడవున రెండు వరుసల రహదారిగా కరకట్టను విస్తరించనున్నారు. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జల వనరులశాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితోపాటు, ఇరువైపులా ఫుట్‌పాత్‌లనూ నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం పనులకు సంబంధించిన చిత్రపటాలను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రసంగించకుండానే మంత్రిమండలి సమావేశం కోసం సచివాలయానికి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మంత్రులు సుచరిత, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు స్వాగతం పలికే సందర్భంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పుష్పగుచ్ఛం ఇచ్చి.. అనంతరం ఆయన కాళ్లకు నమస్కారం చేయడానికి మూడుసార్లు ప్రయత్నించగా జగన్‌ వారించారు.

త్వరలోనే రైతులకు ప్లాట్లు: మంత్రి బొత్స

పాలనా వికేంద్రీకరణ చట్టంలో చెప్పినట్లుగా మూడు ప్రాంతాల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇందులో భాగంగానే కరకట్ట విస్తరణ పనులను చేపట్టామన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి నిధులు వృథా కాకుండా అమరావతిలో పనులు చేపడతామని వివరించారు. త్వరలోనే రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు. కరకట్ట పనులను చేపట్టడం ద్వారా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పక్కన పెడతారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఆ రహదారి పనులూ చేపడతామని తెలిపారు.

రాష్ట్రానికి నష్టం వాటిల్లితే సహించం

నీటి వినియోగంపై మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, చేతులు ముడుచుకుని లేమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఏపీ సర్కారు గట్టిగా స్పందించడం లేదనే అంశాన్ని ఆయన ఖండించారు. అసభ్యకరంగా ఒకరికొకరు దూషించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు సందర్శన విషయంలో కేఆర్‌ఎంబీకి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నాయకులు మాట్లాడితే, అక్కడి ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని బొత్స వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు.. సీఎం శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details