అర్హులైన వారికి ఇచిత ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం 30వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం జగన్ చెప్పారు. ఉచిత ఇంటి స్థలాల పంపిణీ నిరంతరం జరపాలని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు.
'గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరగాలి. గ్రామంలో సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల నిర్వహణ తీరును గ్రామ సచివాలయాల సిబ్బంది స్వయంగా పరిశీలించే అవకాశాన్ని కల్పించాలి. సిబ్బంది సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే అమల్లో ఉన్న ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్’ చేసుకునే సదుపాయాన్ని యథావిధిగా కొనసాగించాలి.' అని సీఎం ఆదేశించారు.
"కొత్త కాలనీల్లోనూ సర్వే జరగాలి"
పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీల్లోనూ సర్వే జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మ్యాపుల తయారీలో ఈ కాలనీలను పరిగణనలోకి తీసుకోవాలని, వీటిలో ప్రతి ఇంటికీ విశిష్ఠ గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడీ నంబరు) ఇవ్వాలని ఆదేశించారు.