రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుగా నిలిచాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పరిషత్ ఎన్నికలు కూడా ముగిసిపోతే వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించేందుకు వీలుకలిగేదని ఆయన అధికారులతో అన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కొద్దిసేపు భేటీ అయిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయిందని జగన్ అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవికూడా జరిగిపోయి ఉంటే బాగుండేదని.. ఏవో కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అధికారులతో అన్నారు. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం కష్టం అవుతాయని స్పష్టం చేశారు.