ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడు రాజధానులకు మద్దతివ్వండి: సీఎం జగన్ - కేంద్రమంత్రులతో సీఎం జగన్ సమావేశం వార్తలు

cm jagan
cm-jagan

By

Published : Dec 15, 2020, 8:40 PM IST

Updated : Dec 16, 2020, 8:01 AM IST

20:38 December 15

అధికార వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిలో భాగంగా 3 రాజధానుల ఏర్పాటుకు చట్టం చేశామని... హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను ఆరంభిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సీఎం జగన్ కోరారు. 2019 భాజపా ఎన్నికల మేనిఫెస్టోలోనూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశముందని ప్రస్తావించారు. పోలవరంపై సవరించిన అంచనాలను ఆమోదించటంతో పాటు... రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించేందుకు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి దిల్లీకి వెళ్లారు. అమిత్‌ షాతో జరిగిన భేటీలో చర్చకొచ్చిన అంశాలను వివరిస్తూ సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. వివిధ రూపాల్లో రాష్ట్రానికి రావాల్సి ఉన్న 14వేల 555 కోట్ల బకాయిలను సీఎం జగన్ వినతిపత్రంలో ప్రస్తావించారు. పోలవరం రెండో సవరించిన అంచనాల ప్రకారం 2017-18 నాటి ధరల ఆధారంగా ప్రాజెక్టు వ్యయాన్ని 55వేల 656 కోట్లకు సవరించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.  

ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు ఆదేశిలివ్వాలని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం... భూసేకరణ, పునరావాసానికయ్యే ఖర్చులను పూర్తిగా రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 2005-06తో పోలిస్తే... 2017-18 నాటికి ముంపు ప్రాంతం నుంచి తరలించాల్సిన కుటుంబాల  సంఖ్య... 44న్నర వేల నుంచి లక్షా ఆరు వేలకుపైగా పెరిగిందని జగన్‌ ప్రస్తావించారు. వెరసి సహాయ, పునరావాస ఖర్చులు అధికమయ్యాయని.... ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం చేసిన ఖర్చులో ఇంకా వెయ్యీ 779 కోట్ల రూపాయల్ని కేంద్రం చెల్లించాల్సి ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని.. దాని ద్వారానే రాష్ట్ర స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని జగన్‌ పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతిచ్చిందని.... అందుకు కావాల్సిన... కేంద్ర విద్యుత్‌శాఖ ధ్రువీకరణ పత్రం రావాల్సి ఉందని.... ఈ ప్రక్రియ వెంటనే పూర్తి చేసేలా ఆ శాఖకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. 2013-14 నుంచి 18-19 వరకూ కేంద్ర ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టిన బియ్యం పంపిణీకి కేంద్రం నుంచి రాయితీ రూపంలో రావాల్సిన 1600 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.  

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా రాష్ట్రానికి ఉన్న 4వేల 308 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించాలన్నారు. 14,15 ఆర్థికసంఘాల సిఫార్సుల మేరకు.... స్థానికసంస్థలకు 3 వేల 66 కోట్లకుపైగా గ్రాంట్లు విడుదలయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం బకాయిలు 3వేల 801కోట్లకుపైగా మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులను కేంద్రం ఆమోదించేలా చూడాలని జగన్.... అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు ఉద్దేశించిన... ఏపీ ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ బిల్లు... రాష్ట్రపతి ఆమోదముద్ర పొందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్‌ వినతిపత్రంలో పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. భారీ వర్షాలు, నివర్‌ తుపాను వల్ల భారీ  పంటనష్టం జరిగిందని ప్రస్తావించారు. ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి నష్టం అంచనాకు  కేంద్రబృందాల పరిశీలన పూర్తైందని.... నివర్ కలిగించిన నష్టం అంచనాకూ బృందాలను పంపాలని... వాటి సిఫార్సుల మేరకు పరిహారాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ టీకా రాగానే ప్రాధాన్య క్రమంలో పంపిణీకి... కోల్డ్ చైన్ల ఏర్పాటు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని జగన్‌ అమిత్‌ షాకు తెలిపారు. అమరావతి నుంచి దిల్లీ పర్యటనకు జగన్ వెంట పలువురు ఎంపీలు, అధికారులు బయల్దేరినా.... అమిత్ షా వద్దకు వెళ్లినప్పుడు విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నారు. 

ఇదీ చదవండి

రాజధాని గురించి భాజపా సూచనలపై ఆలోచిస్తాం: ధర్మాన

Last Updated : Dec 16, 2020, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details