పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన రూ.10 వేల కోట్లను ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విన్నవించారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు 40 నిమిషాలపాటు దిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి 8 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అవన్నీ ముఖ్యమంత్రి దిల్లీ వచ్చిన ప్రతిసారీ చెబుతున్న అంశాలే కావడం గమనార్హం.
‘పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన రూ.10 వేల కోట్లను అందించాలి. రాష్ట్రం సొంతంగా ఖర్చు చేసిన రూ.2900 కోట్లను తక్షణమే చెల్లించాలి.
*సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన రూ.55,548.87 కోట్ల ప్రాజెక్టు వ్యయానికి ఆమోదం తెలపాలి. పనుల్లో తీవ్ర జాప్యానికి కారణమవుతున్న విభాగాలవారీ తిరిగి చెల్లింపుల విధానానికి స్వస్తి చెప్పాలి. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో మాదిరిగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని, చేసిన పనులకు 15 రోజుల్లోగా తిరిగి చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలి.
రెవెన్యూ లోటు రూ.32,625 కోట్లు
రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.32,625.25 కోట్లను మంజూరు చేయాలి. 2014-15 కాలానికి సంబంధించిన బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పింఛన్ల రూపంలో రాష్ట్రానికి లోటు ఏర్పడినందున దాన్ని భర్తీ చేయాలి.
2.68 కోట్ల మందికి రేషన్
రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ అందుతోంది. వీరిలో 61% మంది గ్రామాలకు, 39% మంది పట్టణాలకు చెందినవారున్నారు. చట్టం నిర్దేశించిన ప్రకారం గ్రామాల్లో 75% మందికి, పట్టణాల్లో 50% మందికి పీడీఎస్ ప్రయోజనాలు అందాల్సింది ఉంది. ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో ఏపీకంటే కనీసం 10% మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారు. కొవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇచ్చింది. దీనివల్ల సుమారు రూ.5,527.63 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్రం మోయాల్సి వచ్చింది. అందువల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలించాలి. నెలవారీగా రాష్ట్రానికి కేటాయిస్తున్న బియ్యం కోటాలో 3లక్షల టన్నులు వినియోగంకాకుండా ఉంటున్నాయి. ఇందులో కేవలం 77 వేల టన్నులు ఏపీకి కేటాయిస్తే సరిపోతుంది.