రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన వీరి సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. గవర్నర్ ఇటీవలే దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా తదితరుల్ని కలిశారు. రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పులు, రాబోయే రోజుల్లో రాష్ట్రంపై వాటి ప్రభావం, పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితి వంటి అంశాలపై ఆయన ప్రధాని తదితరులకు నివేదికలు అందజేసినట్లు సమాచారం. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రికి, ఆయన సతీమణి భారతికి రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు బిశ్వభూషణ్ హరిచందన్‌ను, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌ను కలిశారు. గవర్నర్ దంపతులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. గవర్నర్, ముఖ్యమంత్రి భేటీలో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా సమాలోచనలు జరిపారని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువైందని గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు’’ అని వెల్లడించింది. ముఖ్యమంత్రి వెంట రాజ్‌భవన్‌కు వెళ్లినవారిలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు తదితరులున్నారు.
గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ - CM Jagan Meet Governor
CM Jagan Meet Governor Biswabhusan: ముఖ్యమంత్రి జగన్.. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. గవర్నర్ దిల్లీ పర్యటన అనంతరం సీఎం కలవడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్‌తో సమాజ సేవకుల భేటీ:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాల్ని దారిద్య్రరేఖకు దిగువనున్నవారికి చేరేలా సమాజ సేవకులు తగిన సహకారం అందించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో పలు రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న వ్యక్తుల బృందం గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తామందిస్తున్న సేవల గురించి వివరించింది. ఆ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గవర్నర్‌ను కలిసినవారిలో పారిశ్రామికవేత్తలు, వైద్య నిపుణులు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, కళాకారులు ఉన్నారు.
ఇదీ చదవండి:ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్