రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏటా డిసెంబర్లో ఖాళీలను గుర్తించి, జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. పోలీసు శాఖలో ప్రస్తుతమున్న ఖాళీలతో పాటు, వారాంతపు సెలవుల విధానానికి కావాల్సిన సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ భర్తీ ప్రక్రియ చేపడామని సీఎం వెల్లడించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక మైదానంలో బుధవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరై ప్రసంగించారు.
పోలీసు సంక్షేమ నిధికి మూడేళ్లుగా ఉన్న బకాయిల తక్షణ విడుదలకు ఆర్థిక శాఖను ఆదేశించామని సీఎం జగన్ అన్నారు. దిశ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, త్వరలోనే ఆమోదం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబానికి అండగా ఉంటూ, సంపూర్ణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అసాంఘిక శక్తులు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని పోలీసు శాఖకు సూచించారు.