గాన గంధర్వుడు.. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమ్మణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో 16 భాషల్లో 40 వేలకు పైగా గీతాలు ఆలపించి...బాలు దేశ ప్రజల మన్నలను అందుకున్నారని ప్రధానికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంగీత ప్రియులను తన పాటలతో ఆకట్టుకున్నారన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలను ఎన్నో కైవసం చేసుకున్నారని జగన్ లేఖలో ప్రస్తావించారు.
తన ప్రతిభతో పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను సైతం పొందారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సంగీతంలో విశేష కృషిచేసిన లతామంగేష్కర్, భూపేన్‌హజారిక, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, బిస్మిల్లాఖాన్, భీమ్‌సేన్ జోషి వంటి వారికి భారతరత్నతో కేంద్రప్రభుత్వం గౌరవించిందని సీఎం జగన్ తెలిపారు. అంతటివారితో సరిసమానుడైన ఎస్పీ బాలసుబ్రమ్మణ్యానికి కూడా భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్... ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.