పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలని, నిర్మాణం పూర్తి చేసేలా నిధులు ఇప్పించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విన్నవించారు. ఇప్పటికే 2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీలు తుది అంచనాలు ఆమోదించాయని, రివైజ్డు కాస్ట్ కమిటీ సైతం రూ.47,617.74 కోట్ల అంచనాల సవరణకు ఆమోదించిందని వివరించారు. ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చేలా కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలకు సూచించాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు. ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతిని శనివారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ విడుదల చేశారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే ఎక్కడో సమాచారలోపం ఉందని అనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే ఇలా ఉన్నాయి.
- రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రమే ప్రాజెక్టును నిర్మిస్తుందని, అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా చూస్తుందని చట్టంలో పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 1 వరకు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పరిగణిస్తామన్నారు. 29.4.2014 నాటి కేబినెట్ నోట్‌లోని 5.3 పేరాలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారు. పోలవరం వ్యయాన్ని నాడు 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లుగా ప్రస్తావిస్తూనే... తదుపరి కాలానుగుణంగా పెరిగే వ్యయాన్ని, ఆయకట్టు అభివృద్ధికి అయ్యే ఖర్చును, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసంతో సహా ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరిస్తామని ఆ నోట్‌లో పేర్కొన్నారు.
- 2014 మే 28న గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ద్వారా లేదా, ఇతర నిపుణులైన ఏజెన్సీల ద్వారా ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. అంటే పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం నిర్మాణ బాధ్యత మాత్రమేనని స్పష్టమవుతోంది. 2014 పునర్ విభజన చట్టంలో పేర్కొన్నట్లు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.
- 2005 నుంచి వరుసగా సాంకేతిక సలహా కమిటీలు, తాజాగా సాంకేతిక సలహా కమిటీతోపాటు రివైజ్డు కాస్ట్ కమిటీ రూ.28,919.95 కోట్లకు అంచనా వ్యయం పెంచింది. కాలానుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతున్న విషయం దీంతో తెలుస్తోంది. 2017లో మొదటి సవరణ అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతిని కేంద్ర ఆర్థికశాఖ షరతులతో ఇచ్చింది. 2014 ఏప్రిల్ ఒకటి నాటికి పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని, తాజా ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని రాష్ట్రమే తన వనరుల నుంచి సమకూర్చుకోవాలని 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈ అసంబద్ధ నిర్ణయం 2014 రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధం. పైగా ఇది రాష్ట్రానికి మోయలేని అదనపు భారమవుతుంది. ఇప్పటికే రాష్ట్రం తన వాటా వ్యయాన్ని ఖర్చు చేసింది. దాన్ని రాష్ట్రవాటా ధనంగా 2016 మే 26 నాటి కేంద్ర కేబినెట్ తీర్మానంలోనూ అంగీకరించారు.
అన్నీ పరిశీలించాకే కమిటీ ఆమోదం