CM Jagan launched Amul milk project in Anantapur: అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ జిల్లాలోకి అమూల్ సంస్థ రంగ ప్రవేశం చేసింది. ఏపీ-అమూల్ ప్రాజెక్టును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 జిల్లాల్లో కార్యకలాపాలు చేస్తోన్న అమూల్ సంస్థ.. మరో జిల్లాకు విస్తరించింది. అనంతపురం జిల్లాలో అమూల్ సంస్థ రంగ ప్రవేశం చేసిందని.. పాలసేకరణ మొదలుపెడుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అమూల్ రాకతో పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడితే గిట్టుబాటు కాదని.. వ్యవసాయానికి పాడి తోడైతేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ పాల ఉత్పత్తి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం వ్యాఖ్యానించారు.
అమూల్ వచ్చాక పరిస్థితులన్నీ మారాయి: సీఎం జగన్ సహకార రంగంలో.. ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదు
'అమూల్ సంస్థ ప్రపంచంలోనే ఎనిమిదో స్ధానంలో ఉండగా.. దేశంలోనే మొదటిస్ధానంలో ఉంది. పాలు పోస్తున్న వారే అమూల్‌కు యాజమానులన్నారు. కొనుగోలలో కాకుండా ప్రాససింగ్‌లోనూ అమూల్‌కు అపార అనుభవం ఉంది. పాలనుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్దాయికి అమూల్ ఎదిగింది. అత్యధిక రేటుకు కొనుగోలు చేస్తూ.. ఎలాంటి మోసాలు, కల్తీ , దళారులు దోపిడీ లేకుండా పనిచేస్తోందన్నారు. వచ్చిన లాభాలను బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి మహిళలకే తిరిగి వెనక్కి ఇస్తోందన్నారు. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదు' అని జగన్ అన్నారు. పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి విస్తృత తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మోసాల్లో పట్టుబడిన కేసులను పరిశీలిస్తే.. ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 చొప్పున తక్కువగా చెల్లిస్తున్నట్లు వెల్లడైందన్నారు.
అమూల్‌తో అక్కచెల్లెమ్మలకు మేలు
ఇప్పటికే ఆరు జిల్లాల్లో పాల సేకరణ చేస్తోందన్న అమూల్.. ఇప్పుడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పాలసేకరణ చేస్తోందని జగన్ పేర్కొన్నారు. అక్కడ అమూల్‌తో అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుందన్నారు. 'అమూల్ రాకతో లీటరుకు రూ. 5 నుంచి 20 వరకూ లాభం చేకూరుతోంది. అలాగే పాడి రైతుల ఎదుటనే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ చేస్తోంది. పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఎలాంటి మోసాలకు తావులేకుండాలేకుండా ప్రభుత్వం విస్తృతం తనిఖీలు చేపట్టింది. పాడి రైతులకు మంచి జరగాలని.. వాళ్లకు గ్రామంలోనే అదనపు అదాయం సమకూరాలని.. ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు జగన్ వివరించారు.
అంగన్‌వాడీలకు పాలు, బాలామృతం సరఫరాపై అమూల్‌తో ఒప్పందం
రాష్ట్రంలో బాలామృతం, అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాపై అమూల్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ మేరకు పత్రాలపై సంతకాలు చేశారు. తమ సంస్థ గత 15 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో అంగన్‌వాడీలు, పాఠశాలల్లో రోజుకు 25 లక్షల మంది పిల్లలకు రోజూ తాజా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తోందని అమూల్ ఎండీ ఆర్‌ఎస్ సోధి వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రాసెసింగ్ కేంద్రాలకు దగ్గరలోని కేంద్రాలకు తాజా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తాం. సబర్‌కాంత పాడి సహకార సంఘం ఆధ్వర్యంలో ప్లాంటు ఏర్పాటు చేసి అంగన్‌వాడీల్లోని పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం. రాష్ట్రంలో పాల ప్రాసెసింగ్‌కు తగిన సౌకర్యాలు కల్పించాలి. మదనపల్లిలో ఒక యూనిట్ ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో యూనిట్లు ప్రారంభమవుతాయి. అప్పుడు అక్కడే పాలు ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి విక్రయిస్తాం’ అని ఎండీ ఆర్‌ఎస్ సోధి వివరించారు. తమకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రోజుకు లక్ష లీటర్ల పాలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో సేకరణ మరింత పెరుగుతుందని చెప్పారు. తమ పాలకు అధిక ధర లభిస్తోందని ఈ సందర్భంగా పలువురు మహిళలు సీఎం జగన్‌కు వివరించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, సీఎస్ సమీర్‌శర్మ, వ్యవసాయ మిషన్ వైస్‌ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, కైరా మిల్క్, బనస్కాంత, సబర్‌కాంత పాల సంఘాల ఎండీలు అమిత్ వ్యాస్, సంగ్రామ్ చౌదరి, అనిల్ బయాతీ, అమూల్ సీనియర్ జీఎం రాజన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ.. సమ్మెపై కార్యాచరణ!