రాష్ట్రంలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్... తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మొత్తం 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే కడప జిల్లా పులివెందుల, విశాఖ జిల్లా పాడేరు కళాశాలల పనులు ప్రారంభించింది. మిగిలిన 14 కళాశాలల నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారు. విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాలలో.. ఈ కళాశాలలు నిర్మించనున్నారు. దాదాపు 8 వేల కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో వీటిని నిర్మిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కళాశాలకు అనుబంధంగా అన్ని రకాల వసతులతో ఉన్న 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా అందుబాటులోకి వస్తాయని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో ఆరోగ్య హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వీటిలో ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఒక్కొక్కరికీ 5 ఎకరాలు భూమి ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 100 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలిస్తామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో మరో 90 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 10వేల 111 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.