CM Jagan: ‘మీ పనితీరు మెరుగుపరుచుకుంటూ మీ అంతట మీరే మారాలి.. లేదా ఆర్నెల్ల తర్వాత మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది’ అని వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు స్పష్టం చేశారు. ‘సీఎంగా నాది, ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉన్నాయి.. కానీ చాలామంది ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగా తక్కువగా ఉంది.. ప్రజల్లో ఉంటూ మీ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఉపయోగ పడుతుంది. మేం తిరగలేం, చేయలేమంటే చెప్పేయండి తిరిగి పనిచేసే వారినే నియమిస్తా.. మళ్లీ మనం ప్రభుత్వంలోకి వచ్చాక మీకు ఏదైనా చేద్దాం’ అని చెప్పారు.‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా బాధ్యులతో బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
గడప దాటనివారు ఏడుగురు
‘ప్రజల్లోనే ఉండాలని గడప గడపకు కార్యక్రమాన్ని పెడితే ఎమ్మెల్యేలు చాలామంది పట్టించుకోవడం లేదు.. మీరు ఏ రోజు ఏ గ్రామానికి, ఏ ఇంటికి వెళ్లారు? అక్కడ ప్రజలు మిమ్మల్ని ఏం అడిగారు? మీరేం సమాధానం చెప్పారు వంటి సమాచారమంతా నా దగ్గర ఉంది. ప్రతిరోజూ మీ పర్యటనలకు సంబంధించి అన్ని అంశాలూ నాదృష్టికొస్తాయి.. మే 11న కార్యక్రమం మొదలు పెడితే ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు అసలు ఒక్కరోజు కూడా తిరగలేదు. దాదాపు 65 మంది 10 రోజుల్లోపే తిరిగారు. 20 రోజులకు పైబడి తిరిగిన ఎమ్మెల్యేలు సింగిల్ డిజిట్‌లో ఉండటమేంటి? ఇలాగైతే మీ పనితీరు మెరుగుపడేదెలా? మొదటి నెల కాబట్టి ఇప్పుడు సరే కానీ, మున్ముందు ఇలా ఉండదు, ఆర్నెల్ల తర్వాత పూర్తిస్థాయి సమీక్ష చేసి పనితీరు బాగాలేని వారిస్థానంలో కొత్త ఇన్‌ఛార్జులను నియమించుకోక తప్పదు. గడప గడపకూ కార్యక్రమంలో మీ (ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు) కుటుంబ సభ్యులను తిప్పితే దాన్ని లెక్కలోకి తీసుకోం, మీరే నెలలో కనీసం 20 రోజులపాటు తిరగాల్సిందే’ అని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
2024లో కొడితే 30 ఏళ్లు మనమే!
‘2024 ఎన్నికల్లో కొడితే, ఇక మనకు ప్రతిపక్షం ఉండదు, మరో 30 ఏళ్లు ఉంటాం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన రుషిరాజ్ సింగ్ బుధవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తుంటే.. కొందరు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు ఇంటింటికీ వెళ్తున్నారు. ఇలాకాకుండా ఇంటింటికీ అందరూ వెళ్లాలని చెబుతూ కార్యక్రమ మార్గదర్శకాలను వివరించినట్లు తెలిసింది.
ఎవరు ఎన్నిరోజులు తిరిగారంటే..
గడప గడపకూ కార్యక్రమంలో ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు తిరిగారనే వివరాలను ప్రభుత్వ ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ వెల్లడించినట్లు తెలిసింది. ఏలూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, కావలి, కోవూరు, మైలవరం, శ్రీశైలం ఎమ్మెల్యేలు అసలు తిరగలేదని తెలిపినట్లు సమాచారం. చీఫ్‌విప్ ప్రసాదరాజు 21 రోజులు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ 20 రోజులు ఇలా అతి కొద్దిమందే 15-20 రోజులపాటు తిరిగినట్లు వివరించారని సమాచారం.
పులివెందులకు మినహాయింపు!
‘పులివెందుల, చీపురుపల్లి నియోజకవర్గాలకు గడప గడపకు కార్యక్రమం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉన్నారు’ అని సమావేశానంతరం బయటకొచ్చిన ఎమ్మెల్యేలు చర్చించుకోవడం కనిపించింది.